సాక్షి, హైదరాబాద్: పన్ను కట్టకుండా ఎగ్గొట్టే సౌకర్యం ఉంటే... ఆ ఆలోచన వస్తే కొందరు వ్యాపారులకు పండుగే. అదే బడా కంపెనీలయితే ఎగ్గొట్టేది కూడా భారీగా ఉంటుంది కాబట్టి వ్యూహాలు రచించి మరీ పన్ను ఎగవేతకు పాల్పడుతుంటారు. పన్ను ఎగ్గొట్టే వారి సంఖ్య చాలా తక్కువే అయినా ఆ ఎగవేత విలువ మాత్రం కోట్లలో ఉంటుంది.
ఆ కోట్ల రూపాయలు మిగుల్చుకునేందుకే కొన్ని బడా ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్, జువెలరీ కంపెనీలు ‘త్రైమాసిక’వ్యూహాన్ని ఎంచుకున్నాయి. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు మూడు నెలల పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా మిన్నకున్నాయి. ఆ.. ఎవరు చూస్తారులే.. చూసినా ఏమవుతుందిలే అనే భరోసాతో జీఎస్టీ డీలర్లు పన్నిన వ్యూహాన్ని హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు శోధించి మరీ ఛేదించారు. రూ.110 కోట్లను వారం రోజుల్లో ప్రభుత్వానికి జమ చేశారు.
అసలేం జరిగిందంటే...!
వాస్తవానికి, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) గత ఏడాది జూలై1 నుంచి అమల్లోకి వచ్చింది. అంతకు ముందు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ఉండేది. అయితే, జీఎస్టీ అమల్లోకి రావడానికి సరిగ్గా మూడు నెలల ముందే ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్, మే, జూన్ నెలల మొదటి త్రైమాసికం తర్వాత జీఎస్టీ అమల్లోకి వచ్చింది.
సరిగ్గా ఈ త్రైమాసికాన్నే బడా వ్యాపారులు అదనుగా తీసుకున్నారు. ఎలాగూ పాత ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేయడంతో పాటు కొత్త విధానం అమల్లోకి వచ్చిన ఆరు నెలల వరకు ఎలాంటి ఒత్తిడులు ఉండవనే ముందస్తు వ్యూహంతో జీఎస్టీ అమల్లోకి రావడానికి మూడు నెలల ముందు కట్టాల్సిన పన్నును ఎగవేశారు. ఈ మూడు నెలలకు సంబంధించి రిటర్నులు దాఖలు చేయకుండా, జీఎస్టీ అమల్లోకి వచ్చాక జూలై నెల నుంచి రిటర్నులు దాఖలు చేశారు.
మూడు నెలల రిటర్న్‌లు రాకపోవడంపై ఆరా
2017 సంవత్సరానికి గాను ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను బడా కంపెనీల నుంచి ఎలాంటి రిటర్నులు రాకపోవడంపై హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు దృష్టి సారించారు. ఆ కంపెనీల ట్రాక్ షీట్‌ను పరిశీలించగా, ప్రతి ఏటా ఆ మూడు నెలల్లో రూ.కోటి కన్నా ఎక్కువే సదరు కంపెనీలు పన్ను చెల్లించాయని, జీఎస్టీ అమల్లోకి రావడానికి మూడు నెలల ముందు మాత్రం రిటర్నులు దాఖలు చేయలేదని తేలింది. దీంతో రూ.కోటి కన్నా ఎక్కువ పన్ను చెల్లించిన 100 సంస్థలకు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ జీఎస్టీ అధికారులు.
దీంతో కంగుతిన్న ఆ సంస్థలు మళ్లీ రిటర్నుల బాట పట్టాయి. నోటీసులిచ్చిన వారం రోజుల్లో దాదాపు 75 సంస్థలు రూ.110 కోట్ల వరకు పన్ను చెల్లించాయి. మిగిలిన సంస్థల ప్రతినిధులు కూడా జీఎస్టీ అధికారులను సంప్రదించి కొంత సమయం తీసుకుని పన్ను చెల్లించేందుకు సిద్ధపడటం గమనార్హం. ఇందులో గాయత్రి ప్రాజెక్ట్స్, ఐవీఆర్‌సీఎల్, కొసిన్ లిమిటెడ్, ఆర్వీ అసోసియేట్స్, ఎస్‌ఎస్ కన్‌స్ట్రక్షన్స్ లాంటి సంస్థలున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో మరిన్ని కంపెనీలపై దృష్టి సారించామని, రిటర్నులు దాఖలు చేయని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జీఎస్టీ అధికారులు చెపుతున్నారు. ఈ నెల 31లోగా పన్ను రిటర్నులు దాఖలు చేయాలని, లేదంటే పన్ను చెల్లించాల్సిన మొత్తాన్ని బట్టి నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి, బడా సంస్థలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment