
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ నెల 14న నిర్వహించిన రాత పరీక్షలో భారీ తప్పిదం జరిగింది. టీఎస్‌పీఎస్సీ నేతృత్వంలో ఎగ్జామినర్లు రూపొందించిన ప్రశ్నపత్రంలో ఓ ప్రైవేటు బ్లాగు (http:// spleducation. blogspot.in/2015/09/schoolandclassroommanagementsolved.html?m=1) లోని ప్రశ్నలు యథాతథంగా వచ్చినట్లు వెలుగులోకి వచ్చిం ది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్.. మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వీరారెడ్డి నేతృత్వంలో న్యాయ, సబ్జెక్టు నిపుణులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.
59 ప్రశ్నలు యథాతథం!
గురుకులాల్లోని 304 ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2017లో నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల 14న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించింది. పరీక్ష సమయంలో కొంతమంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్న క్రమంపై మరికొందరికి అనుమానం వచ్చి లోతుగా తెలుసుకోగా బ్లాగు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై అభ్యర్థులు ఫిర్యాదు చేయగా గురువారం కమిషన్ సమావేశమై పరిశీలన జరిపింది. సదరు బ్లాగులో 2015 సెప్టెంబర్ 27న అప్‌లోడ్ చేసిన ప్రశ్నల నుంచి 59 ప్రశ్నలు 14వ తేదీన నిర్వహించిన పరీక్షలో యథాతథంగా వచ్చినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది.
పరీక్ష రద్దే!
ప్రశ్నపత్రం రూపకల్పనలో తప్పు దొర్లినట్లు గుర్తించిన కమిషన్.. పరీక్ష రద్దు చేయాలని అభిప్రాయానికి వచ్చింది. అయితే తప్పును అధికారికంగా నిర్ధారించేందుకు కమిటీ ఏర్పాటు చేసినందున.. కమిటీ నివేదిక వచ్చాక పరీక్ష రద్దు చేయాలని భావిస్తోంది. అలాగే సదరు ఎగ్జామినర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత వర్సిటీకి సిఫార్సు చేయాలని నిర్ణయించింది.
అవే ఎందుకొచ్చినట్లు?
ప్రశ్నపత్రాలు రూపొందించడానికి వైస్ చాన్స్‌లర్లు, సబ్జెక్టు నిపుణులతో కమిటీలు ఉంటాయని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిటీ సభ్యులు 6 ప్రశ్నపత్రాలు రూపొందించి సీల్డు కవర్‌లో అందిస్తారని, వాటిలో ఓ కవర్‌ను ఎంపిక చేస్తారని చెబుతున్నాయి.
అయితే ఆరు రకాల ప్రశ్నపత్రాలున్నపుడు ప్రైవేటు బ్లాగులోని ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నపత్రమే పరీక్షలో ఎలా వచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రాలు రూపొందించిన కమిటీ సభ్యులు బ్లాగు నుంచి ప్రశ్నలు తీసుకున్నారా..?, కొంతమంది కోసం కావాలనే ఈ వ్యవహారం నడిపారా? అని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment