సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహిం చిన గురుకుల టీచర్ల భర్తీలో రిజర్వేషన్ల అమలులో అవకతవకలు, అక్రమాలు జరిగాయని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో నిరుద్యోగ అభ్యర్థులు నిర్వహించిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరగడంతో వందలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఓపెన్ కాంపిటీషన్‌లో రావాల్సిన మెరిట్ అభ్యర్థులను రిజర్వేషన్లలో భర్తీ చేశారని, సర్వీస్ కమిషన్ వారు తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, కోట్ల శ్రీనివాస్, బి.ఆర్.కృష్ణ, బర్క కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment