రాహుల్ వ్యాఖ్యలు పెద్ద జోక్
కాంగ్రెస్ వాళ్లా కుటుంబ పాలన గురించి మాట్లాడేది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాట్లాడడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని మంత్రి కె.తారకరామారావు ఎద్దేవా చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్టుతో రాహుల్‌గాంధీ ప్రసంగించారని, ఇది ఆ పార్టీ చౌకబారుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. సంగారెడ్డి ‘ప్రజాగర్జన’ సభలో కేసీఆర్ సర్కారుపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించడంతో.. గురువారం రాత్రి కేటీఆర్ ట్వీటర్‌లో దీటుగా బదులిచ్చారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల చిత్రాలను తన ట్వీట్లతో జత చేసి.. కాంగ్రెస్ పార్టీ వారా కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నదని విమర్శించారు.
సొంత ఇలాఖాలో గెలవలేని జాతీయ పార్టీల సోకాల్డ్ జాతీయ నాయకులు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్ (కుంభకోణాల) పార్టీగా అభివర్ణిస్తూ.. ‘‘స్కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? దానిని మేం నమ్మాలా? దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? అవినీతి గురించి స్కాంగ్రెస్ లీడర్లు మాట్లాడటం పెద్ద జోక్..’’ అని విమర్శించారు.
ఇప్పటికే ఫోన్ కంపెనీలున్నాయి..
తెలంగాణలో ఇప్పటికే ఐదు మొబైల్ ఫోన్ల కంపెనీలు ఉన్నాయని, మేడిన్ తెలంగాణ ఫోన్ కావాలంటే వెళ్లి వాస్తవాలు కనుక్కోవాలని రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచించారు. కాగా.. ‘కేటీఆర్ పనితీరుపై తనకు గౌరవముందని.. రాహుల్‌గాంధీపై విమర్శలు చేసి ఎందుకు మీ స్థాయి ఎందుకు దిగజార్చుకుంటున్నార’ని ఓ కాంగ్రెస్ కార్యకర్త కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో.. ‘‘నాకు కాంగ్రెస్ పార్టీపై గౌరవం లేదు. వారికి ఏమైనా సిద్ధాంతం ఉందా?..’’ అని కేటీఆర్ బదులిచ్చారు.