ఉదయం పది దాటితేచాలు వడగాడ్పులు పంజా విసరబోతున్నాయి.. నోరు తెరిస్తే చాలు గొంతెండిపోనుంది. అదే మూడు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోనుంది..
- ఇదీ ఈ ఏడాది వాతావరణ పరిస్థితి
- జూన్ వరకూ ఎల్‌నినో.. జూలై నుంచి లానినా
- మండే ఎండలతో చెమటలు కక్కించనున్న ఎల్‌నినో
- పదేళ్ల రికార్డులను దాటనున్న ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలతో ముంచెత్తనున్న లానినా... ఆశాజనకంగా నైరుతి రుతుపవనాలు
- ఇప్పటికే తీవ్ర వడగాడ్పులు.. రాష్ట్రంలో హెచ్చరికలు జారీ
- ఖమ్మం జిల్లా బయ్యారంలో 46.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
- పెరుగుతున్న వడదెబ్బ మరణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి.. ఉదయం పది దాటితేచాలు వడగాడ్పులు పంజా విసరబోతున్నాయి.. నోరు తెరిస్తే చాలు గొంతెండిపోనుంది. అదే మూడు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోనుంది.. కుండపోత వానలతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం కానుంది.. భారీ వర్షాలతో కొత్త ఆశలకు బీజం వేయనుంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులకు కారణం ఎల్‌నినో, లానినా పరిస్థితులే.
భూమధ్యరేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. దీనికి విరుద్ధంగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలుంటే లానినా అంటారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సాధారణం కంటే 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలున్నాయి. దీంతో బలమైన ఎల్‌నినో ఏర్పడింది. దీని కారణంగానే తెలంగాణ, ఏపీల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్‌లలో గత పదేళ్లలో లేనంత స్థాయిలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. జూన్ చివరి నాటికి ఎల్‌నినో ప్రభావం తగ్గిపోయి.. అది లానినాగా మారుతుంది. దీనివల్ల రుతుపవనాలు మరింత ప్రభావవంతమై భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఎల్‌నినో కారణంగా ఈసారి నైరుతి రుతుపవనాలు నెల రోజులు ఆలస్యంగా వస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంటోంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాలి. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల జూలైలో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముంది. అయితే ఈసారి మంచి వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రెండు నెలలు నిప్పుల కొలిమే
బలమైన ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఇప్పటికే వడగాడ్పులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా బయ్యారంలో ఏకంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ 40 నుంచి 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. బుధవారం సాయంత్రానికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 44.87, అక్కినేపల్లిలో 44.75, మామిడాలలో 43.88, ఖమ్మం జిల్లా రామారంలో 44.27, పెనుబల్లిలో 43.08, దుమ్ముగూడెంలో 43, రంగారెడ్డి జిల్లా ఆలియాబాద్‌లో 43.46, షాపూర్‌నగర్‌లో 43.11, హైదరాబాద్‌లోని షేక్‌పేట, మారేడుపల్లిలో 42.31 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని అనంతపురంలో 42, కర్నూలులో 42.1 తిరుపతిలో 41.4, నందిగామలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌నినోతో ఈ వేసవిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
రెండు రోజులు తీవ్రంగా వడగాడ్పులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు తీవ్రంగా వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి, ఆ శాఖ సీనియర్ అధికారి నర్సింహారావు హెచ్చరించారు. బుధవారం ప్రపంచ వాతావరణ దినం సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా తెలంగాణలోని నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాడ్పులు మరింత తీవ్రంగా ఉంటాయని చెప్పారు. వచ్చే రెండు నెలల పాటు వడగాడ్పులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదుకావడం అరుదని, ఖమ్మంలో ఇప్పటికే సాధారణం కంటే ఐదు డి గ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ఈసారి 45 నుంచి 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతాయన్నారు.
మధ్యాహ్నం బయట తిరగొద్దు
ఈ ఏడాది ఎక్కువ రోజులు వడగాడ్పులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆరు బయట తిరగకూడదని సూచించారు. ఒకవేళ తిరగాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ధరించాలని... నీరు ఎక్కువగా తాగాలని చెప్పారు. నలుపు, ముదురు రంగు వస్త్రాలు ధరించవద్దన్నారు. వడదెబ్బ తగిలినట్లు గుర్తిస్తే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. ఎండలో తిరిగాక వడదెబ్బ తగిలిన విషయాన్ని వెంటనే గుర్తించే పరిస్థితి ఒక్కోసారి ఉండదని... ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవడమే పరిష్కారమని చెప్పారు. భారత వాతావరణ శాఖ వెబ్‌సైట్‌లో కూడా వడగాడ్పులపై హెచ్చరికను పెట్టారు.