ఉపరితల ద్రోణితో నేడు వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
- 15 నాటికి దక్షిణ తెలంగాణకు
- రుతుపవనాలు
- రామగుండంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈనెల 15వ తేదీ నాటికి దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నైరుతి రుతు పవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తర్వాత రాష్ట్రమంతటా విస్తరిస్తాయన్నారు. ఇక గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా గట్టులో 4 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా నవాబుపేటలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శనివా రం రామగుండంలో అత్యధికంగా 41.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 41.3, భద్రాచలం 39.4, ఖమ్మం 37.6, నిజామాబాద్ 37.4, నల్లగొండ 36.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు
వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులు, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. రుతుపవనాలు క్రియాశీ లంగా ఉండటం, ఛత్తీస్‌గఢ్ నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుండటం వల్ల వచ్చే 48 గం టల్లో కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.