
రక్షాబంధన్ సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు రాఖీ కడుతున్న ముస్లిం విద్యార్థినిలు
సాక్షి, హైదరాబాద్: శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినులు, మహిళలు, రాజకీయ ప్రముఖులు.. గవర్నర్ నరసింహన్‌ను కలసి, శుభాకాంక్షలు చెబుతూ ఆయన చేతికి రాఖీలు కట్టారు. రాఖీ కట్టేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ గవర్నర్ నరసింహన్ మాట్లాడి, వారితో రాఖీలు కట్టించుకున్నారు. గవర్నర్ మాట్లాడుతూ.. సమాజంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య బలమైన బంధానికి రక్షాబంధన్ ప్రతీక అన్నారు. మిమ్మల్ని మేం రక్షిస్తామంటూ.. అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములంతా భరోసానిచ్చి, వారి బాధ్యతను స్వీకరించాలన్నారు.
అలాగే, మహిళలపై వేధింపులు, హింసాత్మక ఘటనల కవరేజీలో ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని గవర్నర్ ఆవేదన వ్యక్తంచేశారు. లైంగిక వేధింపుల వీడియోలను పదే పదే ప్రసారం చేయడం మంచిది కాదని.. దీంతో ఆత్మీయులు, బాధితుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఇలాంటివాటిని మీడియా వారు మార్చుకోవాలని.. బాధ్యతాయుతంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.