ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలను ఘనంగా జరిగాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పిల్లా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి మసీదులకొచ్చి ప్రార్థనలు జరిపారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. చాలా మంది ముస్లింలు తెల్లని నూతన వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థించారు. హైదరాబాద్ పాతబస్తీలో రంజాన్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు.
పలు దేశాల్లో ఐసిస్ దాడులు జరపడం, హైదరాబాద్‌లో సైతం ఐసిస్ సానుభూతి పరులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని చార్మినార్, మక్కామసీదు, మీర్ ఆలం ఈద్గా, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఇతర తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచే రంజాన్ వేడుకలు జరుపుకున్నారు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అదే విధంగా కడప, అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో కూడా రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రార్ధనలు నిర్వహించారు. పలు చోట్ల మసీదులు విద్యుత్‌దీపాలతో అలంకరించి పండుగ శోభను తెచ్చారు. ఇదిలా ఉండగా ,గవర్నర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.