రంజాన్‌కు భారీ బందోబస్తు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల దృష్టి
కీలక ప్రాంతాల్లో డేగకంటి నిఘా
గురు, శుక్రవారాల్లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో:రంజాన్ పండుగ సందర్భంగా గురు, శుక్రవారాల్లో జరుగనున్న సామూహిక ప్రార్థనలకు నగర, సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చార్మినార్‌లోని మక్కామసీద్, మీరాలమ్ ఈద్గా, సికిం ద్రాబాద్‌లోని జామే మసీద్‌తో పాటు జంట కమిషనరే ట్ల పరిధిలోని అనేక ప్రార్థన స్థలాల వద్ద డేగకన్ను నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఐసిస్ ఉగ్ర కుట్రల నేపథ్యంలో సున్నిత, అనుమానాస్పద ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా ప్రార్థనా స్థలాల వద్ద 24 గంటలూ సోదాలు చేస్తూ ముస్లిం సోదరులకు భద్రతపై పూర్తి భరోసా ఇచ్చారు. కమిషనరేట్లలోని సిబ్బం ది, అదనపు బలగాలు కలిపి మొత్తమ్మీద 12 వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. జంట కమిషరేట్ల పరిధిలోని సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మఫ్టీ పోలీసుల నిఘాతో పాటు నగర భద్రతా విభాగాల ఆధీనంలో బాంబు నిర్వీర్య బృందాలు కూడా పనిచేయనున్నాయి. హోంగార్డుల నుంచి అడిషనల్ సీపీ స్థాయి అధికారులు వరకూ బందోబస్తులో భాగస్వామ్యులవుతున్నారు. నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ నవీన్ చం ద్, ఈస్ట్ కమిషనర్ మహేశ్ భగవత్ రంజాన్ బందోబస్తును పర్యవేక్షించనున్నారు.
నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు...
రంజాన్ సందర్భంగా మీరాలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తారు. గురు, శుక్రవారాల్లో ఉదయం ఎనిమిది నుంచి 11.30 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి.
రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. పండుగ సందర్భాల్లోనే కాకుండా ఎల్లవేళలా అందరూ మత సామరస్యంతో కలిసి మెలిసి ఉండా లి. ముస్లిం సోదరులందరికీ మా రంజాన్ శుభాకాంక్షలు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మీ సమీప ఠాణాలకు, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారమివ్వండి. -మహేందర్‌రెడ్డి, మహేశ్ భగవత్, నవీన్‌చంద్ (పోలీసు కమిషనర్లు)