► 15న ప్రారంభించేందుకు కసరత్తు
► ఎస్‌బీహెచ్‌తో రిజిస్ట్రేషన్ల శాఖ ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపునకు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత చలానా పద్ధతికి స్వస్తి పలికి, ఇకపై ఈ-చలాన్ల ద్వారానే చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రకాల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం సొమ్ము చెల్లింపులో వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలను నివారించే దిశగా రిజిస్ట్రేషన్ల శాఖ ఈ-చలాన్ల ప్రక్రియ రూపొందించింది. దీని అమలుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్)తో ఇప్పటికే శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 15న ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లందరికీ దశలవారీగా శిక్షణ ఇస్తున్నామన్నారు. తొలి దశలో హైదరాబాద్‌లో శిక్ష ణ పొందిన సబ్ రిజిస్ట్రార్లు... జిల్లాల్లో మిగిలిన సబ్‌రిజిస్ట్రార్లకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఆన్‌లైన్ పేమెంట్స్‌కు ఎస్‌ఎస్‌ఎల్
బ్యాంకుల తో ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించేందుకు అవసరమైన సెక్యూరిటీ సాకెట్ లేయర్ (ఎస్‌ఎస్‌ఎల్) సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ శాఖకు లభించింది. దీంతో ఎస్బీహెచ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా సొమ్ము చెల్లింపు, స్వీకరణ సేవలను వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న బ్యాంకు శాఖలో మాత్రమే వినియోగదారులు చలానాలు చెల్లించవలసి వచ్చేది. ఈ-చలాన్ల ప్రక్రియ అందుబాట్లోకి రావడంతో ఇకపై బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేకుండానే ఆన్‌లైన్‌లో లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 950 ఎస్బీహెచ్ బ్యాంకు శాఖల్లో ఎక్కడైనా స్టాంప్ డ్యూటీ చెల్లించవచ్చు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పేరిట ఒకే ఖాతా నంబరుకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల సొమ్ము జమయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిద్వారా వినియోగదారుల చెల్లించిన సొమ్ము నేరుగా రిజిస్ట్రేషన ్ల శాఖకు చేరుతుంది.
దొంగ చలాన్లకు చెక్...
బ్యాంకులో లేదా ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా స్టాంప్ డ్యూటీ చెల్లించిన వినియోగదారులకు రశీదుతో పాటు 12 అంకెల కోడ్ నంబరును బ్యాంకు అందిస్తుంది. ర శీదు, బ్యాంక్ ఇచ్చిన కోడ్ నంబరును సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తే సరిపోతుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపు వివరాలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న డాక్యుమెంట్‌పై ముద్రించేలా అధికారులు చర ్యలు చేపట్టారు. దీంతో దొంగ చలాన్లను అరికట్టడంతో పాటు తాము చెల్లించిన మొత్తానికి వినియోగదారులకు భరోసాను కల్పించినట్లవుతుందని శాఖ భావిస్తోంది.