ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు
♦ దివంగత ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డికి అసెంబ్లీలో సీఎం నివాళి
♦ ఆయన మృతిపై సభలో సంతాప తీర్మానం
♦ రాజకీయాల్లో హుందాతనాన్ని కొనసాగించారని కితాబు
♦ ఆయన మరణం తీరని లోటు: సీఎల్పీ నేత జానారెడ్డి
♦ ఘన నివాళులర్పించిన వివిధ పార్టీల సభ్యులు
♦ తీర్మానానికి స్పీకర్ ఆమోదం.. సభ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ గతవారం కన్నుమూసిన ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి అసెంబ్లీ శుక్రవారం ఘన నివాళులర్పించింది. శాసనసభ ప్రారంభం కాగానే వెంకట్‌రెడ్డి మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపి తీర్మానం ప్రవేశపెట్టారు. లింగాల గ్రామ సర్పంచ్‌గా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన..సహకార సంఘం అధ్యక్షుడిగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. రాజకీయాల్లో సైతం ఆయన హుందాతనాన్ని కొనసాగించారన్నారు.
మితభాషి, మృదుస్వభావి అయిన వెంకట్‌రెడ్డి వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించేవారని, పశుపోషణ అంటే కూడా ఆయనకు ఎంతో ఇష్టమని.. మేలు జాతి పశువులను పెంచేవారని కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, దేశంలో ఎక్కడ ఎడ్ల పందేలు జరిగినా వెంకట్‌రెడ్డి పెంచిన గిత్తలకు అవార్డులు దక్కేవని గుర్తుచేశారు. నాలుగేళ్లపాటు క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన ఆయనకు ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 84లక్షలు విడుదల చేసిందన్నారు. బలీయమైన విధి ఆయనను దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వ్యక్తిగతంగా, ప్రభుత్వపక్షాన కేసీఆర్ సంతాపం తెలియజేశారు.
వ్యక్తిగతంగా తీరని లోటు: జానారెడ్డి
రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ప్రతిపక్ష నేత జానారెడ్డి పేర్కొన్నారు. 33 ఏళ్ల క్రితం వెంకట్‌రెడ్డి తనకు పరిచయమయ్యారని..తాను వేరే పార్టీలో ఉన్నప్పటికీ అభిమానించేవారని, అదే అనుబంధం చివరి వరకు కొనసాగిందని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి చివరి వరకు కొనసాగిన వెంకట్‌రెడ్డి.. 1969లో తెలంగాణ ఉద్యమంలో సైతం తన వంతు పాత్ర పోషించారన్నారు. ఖమ్మం జిల్లాతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పార్టీ ప్రతిష్ట పెంచేందుకు కృషి చేశారని జానారెడ్డి కొనియాడారు. క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ కూడా ఆయన చివరిదాకా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణం వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని జానారెడ్డి పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ కమ్యూనిస్టు కోటగా పేరుగాంచిన ఖమ్మం జిల్లాలో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తన దైన పాత్ర పోషించారని, జిల్లా రాజకీయాల్లో ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలబడ్డ నాయకుడని కొనియాడారు. నిండైన పంచెకట్టుతో రైతుకు మారురూపుగా కనిపించేవారని, విలక్షణమైన రాజకీయవేత్తగా గిరిజన కుటుంబాల్లో మమేకమయ్యారని ఆయన పేర్కొన్నారు.
ఉపఎన్నికను ఏకగ్రీవం చేయాలి: పువ్వాడ అజయ్
సీనియర్ రాజకీయవేత్తగా ప్రజల పక్షపాతిగా చివరి వరకు కొనసాగిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి స్మారకార్థం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయతల పెట్టిన కృషి విజ్ఞాన కేంద్రానికి ఆయన పేరు పెట్టాలని, ఆయన స్వగ్రామం లింగాలలో దాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గతంలో సీనియర్ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు వారి గౌరవార్థం ఉప ఎన్నికలను నివారించేందుకు ఏకగ్రీవం చేసేవారని, అదే సంప్రదాయాన్ని పాలేరు ఉప ఎన్నికలో కొనసాగించాలని కోరారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎంలు కూడా ఇందుకు సహకరించాలని సూచించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మాస్‌లీడర్ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొనియాడారు. బీజేపీపక్ష నేత కె.లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, జె.గీతారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం నుంచి పాషాఖాద్రి, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, సున్నం రాజయ్య సహా మరికొందరు ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.