ramreddy venkatreddy
-
'సానుభూతి దివంగతనేత పైనే, కాంగ్రెస్‌పై కాదు'
హైదరాబాద్: దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబంపై సానుభూతి ఉంది కానీ, కాంగ్రెస్ పార్టీపై లేదని ఎంపీ కవిత అన్నారు. తాము అభ్యర్థిని ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్‌ను కలుస్తామని హడావిడి చేయడం సరికాదన్నారు. పాలేరు ఎన్నికకు, టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధం లేదని కవిత స్పష్టంచేశారు. -
ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు
♦ దివంగత ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డికి అసెంబ్లీలో సీఎం నివాళి ♦ ఆయన మృతిపై సభలో సంతాప తీర్మానం ♦ రాజకీయాల్లో హుందాతనాన్ని కొనసాగించారని కితాబు ♦ ఆయన మరణం తీరని లోటు: సీఎల్పీ నేత జానారెడ్డి ♦ ఘన నివాళులర్పించిన వివిధ పార్టీల సభ్యులు ♦ తీర్మానానికి స్పీకర్ ఆమోదం.. సభ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ గతవారం కన్నుమూసిన ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి అసెంబ్లీ శుక్రవారం ఘన నివాళులర్పించింది. శాసనసభ ప్రారంభం కాగానే వెంకట్‌రెడ్డి మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపి తీర్మానం ప్రవేశపెట్టారు. లింగాల గ్రామ సర్పంచ్‌గా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన..సహకార సంఘం అధ్యక్షుడిగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. రాజకీయాల్లో సైతం ఆయన హుందాతనాన్ని కొనసాగించారన్నారు. మితభాషి, మృదుస్వభావి అయిన వెంకట్‌రెడ్డి వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించేవారని, పశుపోషణ అంటే కూడా ఆయనకు ఎంతో ఇష్టమని.. మేలు జాతి పశువులను పెంచేవారని కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, దేశంలో ఎక్కడ ఎడ్ల పందేలు జరిగినా వెంకట్‌రెడ్డి పెంచిన గిత్తలకు అవార్డులు దక్కేవని గుర్తుచేశారు. నాలుగేళ్లపాటు క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన ఆయనకు ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 84లక్షలు విడుదల చేసిందన్నారు. బలీయమైన విధి ఆయనను దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వ్యక్తిగతంగా, ప్రభుత్వపక్షాన కేసీఆర్ సంతాపం తెలియజేశారు. వ్యక్తిగతంగా తీరని లోటు: జానారెడ్డి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ప్రతిపక్ష నేత జానారెడ్డి పేర్కొన్నారు. 33 ఏళ్ల క్రితం వెంకట్‌రెడ్డి తనకు పరిచయమయ్యారని..తాను వేరే పార్టీలో ఉన్నప్పటికీ అభిమానించేవారని, అదే అనుబంధం చివరి వరకు కొనసాగిందని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి చివరి వరకు కొనసాగిన వెంకట్‌రెడ్డి.. 1969లో తెలంగాణ ఉద్యమంలో సైతం తన వంతు పాత్ర పోషించారన్నారు. ఖమ్మం జిల్లాతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పార్టీ ప్రతిష్ట పెంచేందుకు కృషి చేశారని జానారెడ్డి కొనియాడారు. క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ కూడా ఆయన చివరిదాకా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణం వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని జానారెడ్డి పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ కమ్యూనిస్టు కోటగా పేరుగాంచిన ఖమ్మం జిల్లాలో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తన దైన పాత్ర పోషించారని, జిల్లా రాజకీయాల్లో ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలబడ్డ నాయకుడని కొనియాడారు. నిండైన పంచెకట్టుతో రైతుకు మారురూపుగా కనిపించేవారని, విలక్షణమైన రాజకీయవేత్తగా గిరిజన కుటుంబాల్లో మమేకమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఉపఎన్నికను ఏకగ్రీవం చేయాలి: పువ్వాడ అజయ్ సీనియర్ రాజకీయవేత్తగా ప్రజల పక్షపాతిగా చివరి వరకు కొనసాగిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి స్మారకార్థం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయతల పెట్టిన కృషి విజ్ఞాన కేంద్రానికి ఆయన పేరు పెట్టాలని, ఆయన స్వగ్రామం లింగాలలో దాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గతంలో సీనియర్ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు వారి గౌరవార్థం ఉప ఎన్నికలను నివారించేందుకు ఏకగ్రీవం చేసేవారని, అదే సంప్రదాయాన్ని పాలేరు ఉప ఎన్నికలో కొనసాగించాలని కోరారు. టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎంలు కూడా ఇందుకు సహకరించాలని సూచించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మాస్‌లీడర్ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొనియాడారు. బీజేపీపక్ష నేత కె.లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, జె.గీతారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం నుంచి పాషాఖాద్రి, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, సున్నం రాజయ్య సహా మరికొందరు ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. -
తేల్చిన కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం... సిట్టింగులయిన రాంరెడ్డి వెంకటరెడ్డి (పాలేరు), మల్లు భట్టి విక్రమార్క (మధిర), వగ్గెల మిత్రసేన (అశ్వారావుపేట), కుంజా సత్యవతి (భద్రాచలం)లకు మళ్లీ పోటీచేసే అవకాశం లభించింది. గత ఎన్నికలలో పోటీచేసి ఓటమి పాలయిన కోరం కనకయ్య (ఇల్లెందు), సంభాని చంద్రశేఖర్ (సత్తుపల్లి)లకు కూడా మరో చాన్స్ లభించింది. ఖమ్మంలో మాత్రం గత ఎన్నికలలో పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థిని మార్చి పువ్వాడ అజయ్‌కుమార్ పేరును ప్రకటించారు. ఇక, జిల్లాలో కాంగ్రెస్ తరఫున సిట్టింగ్గా ఉన్న రేగాకాంతారావు (పినపాక) సీటు సీపీఐతో పొత్తులో గల్లంతయింది. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ కాంతారావుకు రిక్తహస్తాన్నే చూపించింది. పంతం నెగ్గించుకున్న రేణుక ఖమ్మం అసెంబ్లీ స్థానం విషయంలో ఎంపీ రేణుకాచౌదరి తన మాట నెగ్గించుకున్నారు. అధిష్టానం వద్ద ఉన్న తన పలుకుబడినంతా ఉపయోగించి తన అనుచరుడు పువ్వాడ అజయ్‌కుమార్‌కు టికెట్ ఇప్పించుకున్నారు. అజయ్‌కు టికెట్ రాకుండా అటు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే యూనిస్సుల్తాన్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎట్టి పరిస్థితుల్లో తన వర్గీయుడికి సీటు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టిన ఫైర్‌బ్రాండ్ అధిష్టానం వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. ఊహాగానాలకు తెర జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం ద్వారా అన్ని ఊహాగానాలకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. రాంరెడ్డి, భట్టి, సంభానిల విషయంలో ఎలాంటి అనుమానం లేకపోయినా.... కోరం కనకయ్య, సత్యవతి, కాంతారావు, అజయ్‌కుమార్‌ల విషయంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. వీరికి సీటు దక్కుతుందా లేదా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరిగింది. ఒక దశలో సత్యవతి, కనకయ్యలయితే కేంద్ర మంత్రి బలరాంనాయక్‌పై ప్రత్యక్ష ఆరోపణలకే దిగారు. మంత్రి తమకు వ్యతిరేకంగా అధిష్టానానికి నివేదికలిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా ఈసారి తమ నేతకు టికెట్ వస్తుందో లేదోనని వారి అనుచరుల్లోనే గందరగోళం ఏర్పడింది. ఇల్లెందు విషయంలో డీటీనాయక్లాంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. పినపాక పొత్తులో పోయిన కాంతారావును భద్రాచలం పంపుతారని ప్రచారం జరిగింది. ఇక, అజయ్ విషయంలో రేణుక మొదటి నుంచీ గట్టి పట్టు పట్టినా, కొత్తగూడెం సీటును పొత్తులో సీపీఐకి ఇవ్వాల్సి రావడంతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పేరు తెర పైకి వచ్చింది. రాంరెడ్డి వర్గం నుంచి ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్తో పాటు తన సొంత లాబీయింగ్ ద్వారా యూనిస్‌సుల్తాన్ శతవిధాలా టికెట్ కోసం ప్రయత్నించారు. అయినా అధిష్టానం రేణుక సూచించిన అజయ్‌కే టికెట్ కేటాయించింది. -
మేడారం జాతరకు రూ.100 కోట్లు ఉత్తదే
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం జాతర ఏర్పాట్లకు నిధుల కేటాయింపుపై మంత్రులు, ఎంపీలు చెబుతున్న మాటలకు.. వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. జిల్లాలో ఎక్కడ.. ఏ పని జరిగినా.. అది మేడారం జాతర కోసమే అన్నట్లుగా చెబుతున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, రాష్ట్ర మంత్రులు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, గుండు సుధారాణి రెండు రోజుల క్రితం మేడారం వెళ్లారు . ఎప్పుడూ లేని విధంగా జాతర ఏర్పాట్ల కోసం ఈ ఏడాది రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఘనంగా ప్రకటించారు. రెండేళ్ల క్రితం జరిగిన జాతర కంటే వచ్చే జాతరకు అదనంగా 30 లక్షల మంది వస్తారని ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, దీని కోసం నిధులు ఇస్తున్నామని అన్నారు. రూ.100 కోట్ల కేటాయింపుపై మంత్రుల ప్రకటనలు నిజమేనా అని ఆరా తీస్తే.. అసలు విషయాలు బయటపడ్డాయి. దెబ్బతిన్న రోడ్లను వెంటవెంటనే మరమ్మతు చేయాల్సి ఉండగా వాటిని ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు చేపట్టారు. ఇలా రూ.18.57 కోట్లతో జిల్లా వ్యాప్తంగా జాతరతో సంబంధం లేకుండా చేస్తున్న పనులను.. మన మంత్రులు మేడారం కోటాలోనే వేసి మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరిగే జాతరకు వచ్చే కోటి మందికిపైగా భక్తుల అవసరాలకు కోసం 20 ప్రభుత్వ శాఖలు తరఫున రూ.114 కోట్లతో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.87.94 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికి విడుదలైన నిధులను చూసినా.. రూ.100 కోట్లు దాటలేదు. విడుదలైన నిధుల్లో అత్యధికంగా రూ.59.30 కోట్లు రోడ్లు భవనాల శాఖవే ఉన్నారుు. అరుుతే రోడ్లు భవనాల శాఖ వారు రూ.18.57 కోట్లతో జాతర మార్గాలకు ఎలాంటి సంబంధం లేని రోడ్లను మరమ్మతు చేస్తున్నారు. ఎక్కడెక్కడో చేస్తున్న పనులను కూడా జాతర పనుల్లోనే కలిపేశారు. రూ.100 కోట్లు తెచ్చామని చెప్పుకునేందుకు ఇలా సంబంధంలేని పనులను మేడారం పనుల్లో కలపడం విమర్శలకు తావిస్తోంది. -
నేటి నుంచి రచ్చబండ
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో నేటి నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలుత ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పసుపులేటి బాలరాజు హాజరు కావడం లేదు. ఇన్చార్జి మంత్రిగా నియామకం అయిన ఆయన జిల్లా సమస్యలపై ఒక్కసారి డీఆర్సీ నిర్వహించారు. అనంతరం ఇప్పటివరకు ఏ సమస్య పరిష్కారానికీ చొరవ చూపలేదు. రచ్చబండ కార్యక్రమ నిర్వహణ ముందు జిల్లాకు వచ్చి ఈ మూడో విడతలో చేపట్టే కార్యక్రమాలను వివరించి వెళ్లారు. రచ్చబండకు హాజరవుతారని అందరూ ఊహించినప్పటికీ ఆయన డుమ్మా కొట్టారు. తరువాత జరిగే కార్యాక్రమాల్లో పాల్గొంటానని చెప్పినట్లు సమాచారం. టేకులపల్లిలో నిర్వహించే రచ్చబండలో కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి పోరిక బలరామ్‌నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. రచ్చబండ నిర్వహణ వివరాలు... ఇల్లెందు నియోజకవర్గంలో టేకులపల్లిలో 11న, 18న గార్ల, 19న బయ్యారం, 15న కామేపల్లి, 22న ఇల్లందు, 23న ఇల్లందు మున్సిపాలిటీ, పినపాక నియోజకవర్గంలో 15న గుండాల, 18న పినపాక, 19న మణుగూరు మున్సిపాలిటి, 20 అశ్వాపురం, 21 మణుగూరు, 22న బూర్గంపహాడ్, పాలేరు నియోజకవర్గంలో 18న ఖమ్మం రూరల్, 19న తిర్మలాయపాలెం, 20న నేలకొండపల్లి, 22న కూసుమంచి, ఖమ్మం నియోజకవర్గంలో 18న ఖమ్మం , రఘనాధపాలెం, 20న ఖమ్మం కార్పొరేషన్లో, మధిర నియోజకవర్గంలో 22న ఎర్రుపాలెం, 23న మధిర, 24న చింతకాని, 25న బోనకల్లు, 26న ముదిగొండ, వైరా నియోజకవర్గంలో 21న ఏన్కూర్, 23న జూలూరుపాడు, 18న కొణిజర్ల, 25న సింగరేణి, 19న వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలో 15న సత్తుపల్లి, 16న సత్తుపల్లి మున్సిపాలిటి, 18న వేసూరు, 20న తల్లాడ, 22న కల్లూరు, 25న పెనుబల్లి, కొత్తగూడెం నియోజకవర్గంలో 18న పాల్వంచ మున్సిపాలిటి, 19న పాల్వంచ, 21న కొత్తగూడెం, అశ్వారరావుపేట నియోజకవర్గంలో 15న వేలేరుపాడు, 19న ముల్కలపల్లి, 21న చండ్రుగొండ, 22న దమ్మపేట, 23న కుక్కునూరు, 25న అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గంలో 11న వాజేడు, 12న చింతూరు, 14న వీఆర్‌పురం, 15న వెంకటాపురం, 19న చర్ల, 20న భద్రాచలం, 22న దుమ్ముగూడెం, 23న కూనవరంలో నిర్వహించనున్నారు.