ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో నేటి నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలుత ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పసుపులేటి బాలరాజు హాజరు కావడం లేదు. ఇన్‌చార్జి మంత్రిగా నియామకం అయిన ఆయన జిల్లా సమస్యలపై ఒక్కసారి డీఆర్‌సీ నిర్వహించారు.
అనంతరం ఇప్పటివరకు ఏ సమస్య పరిష్కారానికీ చొరవ చూపలేదు. రచ్చబండ కార్యక్రమ నిర్వహణ ముందు జిల్లాకు వచ్చి ఈ మూడో విడతలో చేపట్టే కార్యక్రమాలను వివరించి వెళ్లారు. రచ్చబండకు హాజరవుతారని అందరూ ఊహించినప్పటికీ ఆయన డుమ్మా కొట్టారు. తరువాత జరిగే కార్యాక్రమాల్లో పాల్గొంటానని చెప్పినట్లు సమాచారం. టేకులపల్లిలో నిర్వహించే రచ్చబండలో కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి పోరిక బలరామ్‌నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
రచ్చబండ నిర్వహణ వివరాలు...
ఇల్లెందు నియోజకవర్గంలో టేకులపల్లిలో 11న, 18న గార్ల, 19న బయ్యారం, 15న కామేపల్లి, 22న ఇల్లందు, 23న ఇల్లందు మున్సిపాలిటీ, పినపాక నియోజకవర్గంలో 15న గుండాల, 18న పినపాక, 19న మణుగూరు మున్సిపాలిటి, 20 అశ్వాపురం, 21 మణుగూరు, 22న బూర్గంపహాడ్, పాలేరు నియోజకవర్గంలో 18న ఖమ్మం రూరల్, 19న తిర్మలాయపాలెం, 20న నేలకొండపల్లి, 22న కూసుమంచి, ఖమ్మం నియోజకవర్గంలో 18న ఖమ్మం , రఘనాధపాలెం, 20న ఖమ్మం కార్పొరేషన్‌లో, మధిర నియోజకవర్గంలో 22న ఎర్రుపాలెం, 23న మధిర, 24న చింతకాని, 25న బోనకల్లు, 26న ముదిగొండ, వైరా నియోజకవర్గంలో 21న ఏన్కూర్, 23న జూలూరుపాడు, 18న కొణిజర్ల, 25న సింగరేణి, 19న వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలో 15న సత్తుపల్లి, 16న సత్తుపల్లి మున్సిపాలిటి, 18న వేసూరు, 20న తల్లాడ, 22న కల్లూరు, 25న పెనుబల్లి, కొత్తగూడెం నియోజకవర్గంలో 18న పాల్వంచ మున్సిపాలిటి, 19న పాల్వంచ, 21న కొత్తగూడెం, అశ్వారరావుపేట నియోజకవర్గంలో 15న వేలేరుపాడు, 19న ముల్కలపల్లి, 21న చండ్రుగొండ, 22న దమ్మపేట, 23న కుక్కునూరు, 25న అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గంలో 11న వాజేడు, 12న చింతూరు, 14న వీఆర్‌పురం, 15న వెంకటాపురం, 19న చర్ల, 20న భద్రాచలం, 22న దుమ్ముగూడెం, 23న కూనవరంలో నిర్వహించనున్నారు.