సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం... సిట్టింగులయిన రాంరెడ్డి వెంకటరెడ్డి (పాలేరు), మల్లు భట్టి విక్రమార్క (మధిర), వగ్గెల మిత్రసేన (అశ్వారావుపేట), కుంజా సత్యవతి (భద్రాచలం)లకు మళ్లీ పోటీచేసే అవకాశం లభించింది. గత ఎన్నికలలో పోటీచేసి ఓటమి పాలయిన కోరం కనకయ్య (ఇల్లెందు), సంభాని చంద్రశేఖర్ (సత్తుపల్లి)లకు కూడా మరో చాన్స్ లభించింది.
ఖమ్మంలో మాత్రం గత ఎన్నికలలో పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థిని మార్చి పువ్వాడ అజయ్‌కుమార్ పేరును ప్రకటించారు. ఇక, జిల్లాలో కాంగ్రెస్ తరఫున సిట్టింగ్‌గా ఉన్న రేగాకాంతారావు (పినపాక) సీటు సీపీఐతో పొత్తులో గల్లంతయింది. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ కాంతారావుకు రిక్తహస్తాన్నే చూపించింది.
పంతం నెగ్గించుకున్న రేణుక
ఖమ్మం అసెంబ్లీ స్థానం విషయంలో ఎంపీ రేణుకాచౌదరి తన మాట నెగ్గించుకున్నారు. అధిష్టానం వద్ద ఉన్న తన పలుకుబడినంతా ఉపయోగించి తన అనుచరుడు పువ్వాడ అజయ్‌కుమార్‌కు టికెట్ ఇప్పించుకున్నారు. అజయ్‌కు టికెట్ రాకుండా అటు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే యూనిస్‌సుల్తాన్‌లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎట్టి పరిస్థితుల్లో తన వర్గీయుడికి సీటు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టిన ఫైర్‌బ్రాండ్ అధిష్టానం వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు.
ఊహాగానాలకు తెర
జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం ద్వారా అన్ని ఊహాగానాలకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. రాంరెడ్డి, భట్టి, సంభానిల విషయంలో ఎలాంటి అనుమానం లేకపోయినా.... కోరం కనకయ్య, సత్యవతి, కాంతారావు, అజయ్‌కుమార్‌ల విషయంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. వీరికి సీటు దక్కుతుందా లేదా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరిగింది. ఒక దశలో సత్యవతి, కనకయ్యలయితే కేంద్ర మంత్రి బలరాంనాయక్‌పై ప్రత్యక్ష ఆరోపణలకే దిగారు. మంత్రి తమకు వ్యతిరేకంగా అధిష్టానానికి నివేదికలిస్తున్నారని మండిపడ్డారు.
తద్వారా ఈసారి తమ నేతకు టికెట్ వస్తుందో లేదోనని వారి అనుచరుల్లోనే గందరగోళం ఏర్పడింది. ఇల్లెందు విషయంలో డీటీనాయక్‌లాంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. పినపాక పొత్తులో పోయిన కాంతారావును భద్రాచలం పంపుతారని ప్రచారం జరిగింది. ఇక, అజయ్ విషయంలో రేణుక మొదటి నుంచీ గట్టి పట్టు పట్టినా, కొత్తగూడెం సీటును పొత్తులో సీపీఐకి ఇవ్వాల్సి రావడంతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పేరు తెర పైకి వచ్చింది. రాంరెడ్డి వర్గం నుంచి ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్‌తో పాటు తన సొంత లాబీయింగ్ ద్వారా యూనిస్‌సుల్తాన్ శతవిధాలా టికెట్ కోసం ప్రయత్నించారు. అయినా అధిష్టానం రేణుక సూచించిన అజయ్‌కే టికెట్ కేటాయించింది.
తేల్చిన కాంగ్రెస్
Published Tue, Apr 8 2014 3:14 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement