సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టామని, మరో 14 వేల నియామకాలకు ఉత్తర్వులిచ్చామని, త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో హోం, కార్మిక శాఖ పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం షీ టీమ్స్ హైదరాబాద్‌లో 100, జిల్లాల్లో 100 ఉన్నాయని.. వాటిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
బార్ల సమయంపై మాట్లాడుతూ.. మద్యం సేవించి, వాహనాలు నడిపి ఎదుటి వారి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. మద్యం తాగితే వాహనం నడుపొద్దన్నారు. రాష్ట్రంలో అవసరమున్న చోట కొత్త జైళ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నియోజకవర్గానికి ఓ కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు నాయిని తెలిపారు.
మరో 1,000 మంది అర్చకులకు వేతనాలు: ఇంద్రకరణ్‌రెడ్డి
రాష్ట్రంలో 4,700 మంది అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చేలా చర్యలు ఇప్పటికే చేపట్టామని, నెల రోజుల్లో మరో 1,000 మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అయితే వారికి 010 పద్దు కింద వేతనాలివ్వడం కుదరదన్నారు. ధూపదీప నైవేద్యం కింద రూ. 6 వేలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని.. అందులో రూ. 4 వేలు పూజారికి, రూ. 2 వేలు ధూపదీప నైవేద్యానికి ఇస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment