వ్యూహం బెడిసికొట్టిందా? | a police strategy that failed, constable dies | Sakshi
Sakshi News home page

వ్యూహం బెడిసికొట్టిందా?

Published Sun, Aug 3 2014 12:27 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM

వ్యూహం బెడిసికొట్టిందా? - Sakshi

వ్యూహం బెడిసికొట్టిందా?

అర్ధరాత్రి పోలీసుల డెకాయి ఆపరేషన్
తల్వార్‌తో దాడి చేసిన దుండగులు
కానిస్టేబుల్ మృతి, ఎస్‌ఐ పరిస్థితి విషమం
ఎస్‌ఐ జరిపిన కాల్పుల్లో దుండగుడు మృతి


 హైదరాబాద్/ శామీర్‌పేట/ సిద్దిపేట అర్బన్:  నకిలీనోట్ల ముఠా గుట్టురట్టు చేయాలనుకున్న పోలీసుల వ్యూహం బెడిసికొట్టింది. పక్కా ప్లాన్‌తో సైబరాబాద్ పోలీసులు డెకాయి ఆపరేషన్ మొదలుపెట్టినా .. వారి వ్యూహాన్ని నేరస్తులు ముందే పసిగట్టి ఎదురుదాడికి దిగడంతో కానిస్టేబుల్ మృతిచెందిగా, ఎస్‌ఐకి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో ఎస్‌ఐ జరిపిన కాల్పుల్లో ఒక నిందితుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన రఘు, నరేష్, ముస్తఫా, శ్రీకాంత్, ఎల్లంగౌడ్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. స్కానర్‌మిషన్ కొనుగోలు చేసి నకిలీ నోట్లను జిరాక్స్ తీసి రూ.లక్షకు 2 లక్షల నకిలీ నోట్లు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చింతల్‌కు చెందిన యువకుడు ఈ ముఠాకు పరిచయం అయ్యాడు. లావాదేవీల సమయంలో ముఠా సభ్యులు ఇతడిని మోసగించారు. దీంతో అతడు పోలీసులకు ఉప్పందించాడు. బాలాన గర్ డీసీపీ శ్రీనివాస్, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. రెండు రోజుల క్రితం ముఠా సభ్యులలో రఘు, నరేష్‌లను అదుపులోకి తీసుకోవడంతో శ్రీకాంత్, ముస్తఫా, ఎల్లంగౌడ్ పేర్లు వెలుగు చూశాయి. అయితే పట్టుబడిన నిందితులతో మిగతావారిని రప్పించి అరెస్టు చేయాలన్నది పోలీసుల వ్యూహం.

మొదటి ఆపరేషన్ సక్సెస్

ఈ మేరకు మిగతా ముగ్గురు నిందితులకు అనుమానం రాకుండా పోలీసులు రఘు, నరేష్‌లతో వారికి ఫోన్ చేయించారు. తమకు నకిలీ నోట్లు ఖరీదు చేసే పార్టీ దొరికిందని ఫోన్‌లో చెప్పడంతో సిద్దిపేటకు రావాల్సిందిగా వారు సూచించారు. దీంతో పోలీసులు శుక్రవారం రఘు, నరేష్‌లకు రూ.లక్ష  (అసలు కరెన్సీ) ఇచ్చి సిద్దిపేటకు తీసుకెళ్లారు. ఈ డబ్బులను వారు శ్రీకాంత్, ముస్తఫా, ఎల్లంగౌడ్‌లకు ఇచ్చారు. అందుకు బదులుగా తిరిగి ఆ ముగ్గురు రూ.3 లక్షలు (నకిలీ కరెన్సీ) ఇచ్చారు. ఈ డబ్బులతో పోలీసులు సాయంత్రం ఏడు గంటలకు బాలానగర్‌కు చేరుకున్నారు.

రెండోభాగంలో ఘోరం

తమకు మరో పార్టీ దొరికిందని రఘు, నరేష్‌లు ఆ ముగ్గురికి మళ్లీ ఫోన్  చేశారు. వెంటనే శామీర్‌పేటలోని మజీద్‌పురా చౌరస్తా వద్ద ఉన్న గుడి వద్దకు రాత్రి 11 గంటల వరకు రావాల్సిందిగా వారు చెప్పారు. దీంతో పథకం ఫలించినట్టేనని భావించిన పోలీసులు వారిని అరెస్టు చేయాలని వ్యూహం పన్నారు. మఫ్టీలో  ఎస్‌ఐతో పాటు 11మంది కానిస్టేబుళ్లు మజీద్‌పురా చౌరస్తా వద్దకు రాత్రి 10 గంటలకే చేరుకుని మాటు వేశారు. రాత్రి 11.15 గంటలకు శ్రీకాంత్, ముస్తఫాలు నకిలీ నోట్లను తీసుకుని కారులో వచ్చారు. పార్టీని పిలవాల్సిందిగా శ్రీకాంత్ సైగ చేయడంతో రఘు మాటు వేసిన ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్ ఈశ్వర్‌రావులను పిలిచాడు. నకిలీ నోట్లతో శ్రీకాంత్, ముస్తఫాలు కారు దిగి ఈశ్వర్‌రావుని చూడగానే పోలీసుగా అనుమానించి కత్తులతో దాడికి తెగపడ్డారు. ఈ దాడిలో ఈశ్వర్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా, ఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు. అయినా కూడా ఎస్‌ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో ముస్తఫాపై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పారిపోతున్న శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలో రూ.1.50లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వర్‌రావు, వెంకటరెడ్డిలను అల్వాల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా కొద్దిసేపటికే ఈశ్వర్‌రావు ప్రాణాలొదిలాడు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డికి మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. ఈశ్వరరావు మృతదేహాన్ని ఆయన స్వస్థలం శ్రీకాకుళంకు హెలికాప్టర్‌లో తరలించారు. కాగా,  ఎస్‌ఐ వెంకటరెడ్డిఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని తెలిపారు.
 
ప్రతి పోలీసుకు ఆయుధం: హోంమంత్రి

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ వెంకటరెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేరాల అదుపు చేసేందుకు ప్రతి పోలీసుకు ఆయుధం ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement