మనోళ్లు రాగానే ఆంధ్ర వారిని పంపిస్తాం | Nayani narasimha Reddy clarify on consatable's and police Adjustment | Sakshi
Sakshi News home page

మనోళ్లు రాగానే ఆంధ్ర వారిని పంపిస్తాం

Published Fri, Jan 6 2017 3:23 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

మనోళ్లు రాగానే ఆంధ్ర వారిని పంపిస్తాం - Sakshi

మనోళ్లు రాగానే ఆంధ్ర వారిని పంపిస్తాం

 పోలీసు సిబ్బంది సర్దుబాటుపై హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 9,041 మంది కానిస్టేబుళ్లు, ఎస్సై రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ తుది దశకు చేరిందని, ఇది పూర్తయిన వెంటనే తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్ర ప్రాంత సిబ్బందిని వారి ప్రాంతాలకు పంపించి వేస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మొత్తం 10,315 మంది పోలీసు సిబ్బందిని కమల్‌నాథన్‌ కమిటీ ఏపీకి కేటాయించిందని, అందులో 7,437 మంది ఏపీ బెటాలియన్‌లో పనిచేస్తుండగా, 2,878 మంది తెలంగాణలో పనిచేస్తున్నారని నాయిని చెప్పారు. వీరిలో మరో 431 మంది రిలీవ్‌ అయ్యారని, ఇంకా 2,447 మంది ఇక్కడే ఉన్నారని వివరించారు. వీరందరినీ ఒకేసారి ఆంధ్ర ప్రాంతానికి పంపడం కుదరదన్నారు.

ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత అధికారులు, రాజకీయ నాయకులకు సెక్యూరిటీ కల్పించడం, శాంతిభద్రతలు కాపాడడం లాంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి కనుక తెలంగాణ సిబ్బంది రిక్రూట్‌ కాగానే వారిని ఆంధ్రకు పంపించి వేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత సిబ్బందే కాకుండా... ఏపీలో కూడా 650 మంది తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు పనిచేస్తున్నారని, అక్కడ నిత్యం అవమానాలకు గురవుతున్న వారిని ఎప్పుడు తెలంగాణకు తీసుకువస్తారని కిషన్‌రెడ్డి (బీజేపీ) ప్రశ్నించారు. ఈ సమాచారం తమకు కూడా ఉందని, ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభించామని, వీలున్నంత త్వరగా వారిని తెలంగాణకు తెచ్చేందుకు సీఎం ఆలోచన చేస్తున్నారని నాయిని వివరించారు.

‘పోలీస్‌’లో డిజిటల్‌ అడుగులు
పోలీస్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను డిజిటలైజ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. విదేశాల్లో ఉన్న నెట్‌వర్క్‌ను కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కమాండెంట్‌ కంట్రోల్‌ వ్యవస్థ తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని, వాటన్నింటినీ హైదరాబాద్‌ వ్యవస్థకు అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. రూ.3.36 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల 150 అడుగుల ఎత్తులో రిపీటర్‌ టవర్లు ఏర్పాటు చేయడం ద్వారా మొబైల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను పటిష్టపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు.

కేంద్రంకన్నా ఎక్కువ మందికి సబ్సిడీ బియ్యం : ఈటల రాజేందర్‌
రాష్ట్రంలోని 1.91 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ బియ్యాన్ని అందజేయాలని నిర్ణయిస్తే.. తాము 2.73 కోట్ల మందికి ఇస్తున్నామని పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.2,200 కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్టు ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. కేంద్రం రూ.3కు సబ్సిడీ బియ్యం ఇస్తుంటే తాము రూ.1కే ఇస్తున్నామని చెప్పారు.

సర్కారు ఆసుపత్రుల అభివృద్ధిపై చర్చిస్తాం : లక్ష్మారెడ్డి
ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ లాంటి ప్రముఖ ఆసుపత్రుల్లో సేవలను విస్తరించడంతో పాటు వాటిని అభివృద్ధి చేసే అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆసుపత్రుల్లో మందుల లభ్యతపై ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. చాలా ఆసుపత్రుల్లో 1940 నాటి పరికరాలనే ఇప్పటికీ వినియోగిస్తున్నారని, బడ్జెట్‌ లభ్యత మేరకు కొత్త పరికరాలను తెప్పిస్తున్నామని చెప్పారు. అయితే గతంలో కన్నా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ఆసుపత్రులకు అవసరమైన మందుల కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తున్నట్టు పేర్కొన్నారు.

నల్లవాగుపై లిఫ్ట్‌ అంశాన్ని పరిశీలిస్తాం :హరీశ్‌రావు
నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గం పరిధిలోని నల్లవాగు ఆధునీకరణ కోసం రూ.19 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభించి టెయిలెండ్‌ భూములకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తామని సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ వాగు ఎఫ్‌టీఎల్‌ పెంపుపై సర్వే నిర్వహిస్తామని, లిఫ్ట్‌ ఏర్పాటు ద్వారా మరికొన్ని గ్రామాల్లోని ఆయకట్టును కూడా స్థిరీకరించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement