పోలీసు అమరవీరుడికి నివాళి
నల్లగొండ క్రైం: దుండగుల కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ నాగరాజు మృతదే హం వద్ద పోలీసులు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఘననివాళి అర్పించారు. మృతదేహానికి స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్, కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డి, ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, బీజేపీ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, గౌడ సంఘం నాయకులు తిప్పర్తి జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, కటికం సత్తయ్యగౌడ్, పానగంటి వెంకన్నగౌడ్ , కొండ జానయ్యగౌడ్, పోలీసు అధికారుల సంఘం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఇరుగు సునీల్‌కుమార్ తదితరులు నాగరాజు మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఐజీ, డీఐజీ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబాని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ప్రాణాలతో బయటపడిన సీఐ గంగారం
తుంగతుర్తి: అర్వపల్లి మండల పరిధిలోని సీతారాపురం శివారులో శనివారం తెల్లవారు జామున పోలీసులకు- దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో తుంగతుర్తి సీఐ ఎం. గంగారాం ప్రాణాలతో బయటపడ్డారు. దుండగులు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్నారనే సమాచారంతో సీఐ తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులను చూసిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో తన వద్ద ఉన్న తుపాకీతో ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతుండగా ఒక్కసారిగా సీఐ వద్ద ఉన్న తుపాకీ మొరాయించడంతో వెంటనే సిబ్బందిని తీసుకొని వెనక్కి వెళ్లారు. దీంతో సీఐతో పాటు సిబ్బంది ప్రాణాలతో బయపడినట్లుయ్యింది.
మృతదేహాలకు పంచనామా
మోత్కూరు: మండలంలోని జానకిపురం గ్రామంలో శనివారం పోలీసు కాల్పుల్లో మరణించిన దుండగులు అస్లామ్, జాకీర్ మృతదేహాలకు ఘటనా స్థలంలోనే భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్ పంచనామా నిర్వహించారు. ఆయన వెంట మోత్కూరు తహసీల్దార్ బి.ధర్మయ్య ఉన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో దుండగుల మృతదేహాలు
నల్లగొండ క్రైం : ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఉత్తరప్రదేశ్‌కు చెందినఅస్లం అయూబ్, జాకీర్‌బాదల్‌ల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టమార్టం కోసం ఉంచారు. ఇంటెలిజెన్స్, క్లూస్‌టీం, ఎన్‌ఐఎ బృందాలు సందర్శించి మృతులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించినట్లు తెలిసింది. వీరు సిమి ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా భావిస్తున్నారు. వీరికి సంబంధించి పాతకేసులు, గతంలో జరిగిన పలు హింసాత్మక సంఘటనలపై ఆరా తీస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఐఎస్‌ఐ తీవ్రవాదుల కదలికలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. గుజరాత్ హోంమంత్రి అరుణ్‌పాండ్యన్ హత్యకేసుతో జిల్లాతో ఐఎస్‌ఐ తీవ్రవాదులకున్న లింకు బహిర్గతమైంది. ఐఎస్‌ఐ తీవ్రవాది ఆవేజ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడు. మరికొందరు తీవ్రవాదులు బెయిల్‌పై విడుదలయ్యారు. వీరి మూలాలపైన పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహించారు. వచ్చిపోయే వారి కదలికలపై కూడా నిరంతర నిఘా కొనసాగుతోంది.