సమ్మర్.. విహారం గ్రేటర్
సమ్మర్.. విహారం గ్రేటర్
Published Wed, May 31 2017 1:48 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM
వేసవి సెలవుల్లో దేశ, విదేశాలను చుట్టొచ్చిన హైదరాబాదీలు
- గతేడాది కంటే ఈ సీజన్‌లో 33 శాతం అధికం
- యాత్రా డాట్‌కామ్ సర్వేలో వెల్లడి
- మార్చి–మే మధ్య 1.58 లక్షల మంది విదేశీ పర్యటనలు
- మరో 4.35 లక్షల మంది దేశీయ విమానాల్లో రాకపోకలు
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లో విదేశీ, స్వదేశీ పర్యటనలతో ‘గ్రేటర్’వాసులు ఆహ్లాదంగా గడిపారు. గతేడాది కంటే ఈ ఏడాది దాదాపు 33 శాతం అధికంగా దేశ, విదేశాలకు విమాన ప్రయాణాల చేశారు. యాత్రా డాట్‌కామ్ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలానికిగాను ఈ సర్వే చేశారు. దేశంలోని పర్యాటక స్థలాలను విమానాల్లో చుట్టొచ్చిన వారి సంఖ్య 50 శాతం పెరగగా.. విదేశీ పర్యటనలు చేసినవారి సంఖ్య 33 శాతం పెరిగినట్లు అందులో వెల్లడైంది. పర్యాటక ప్యాకేజీలు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులోకి రావడంతో ఇలా పర్యటనలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
యాత్ర ఏదైనా.. విమాన ప్రయాణమే!
గ్రేటర్ నగరానికి ఆణిముత్యంలా ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం 400 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వాటిలో సుమారు 40 వేల మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ వేసవి సెలవుల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, గోవా, కేరళ, ముంబై, విశాఖపట్నం, చెన్నై, హిమాచల్‌ప్రదేశ్ వంటి పర్యాటక స్థలాలకు వెళ్లేందుకు సుమారు 4.35 లక్షల మంది విమానాలనే ఎంచుకున్నట్లు సర్వేలో గుర్తించారు. ఇక సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్, కౌలాలంపూర్, లండన్, ఆమ్‌స్టర్‌డ్యామ్ వంటి అంతర్జాతీయ నగరాలకు సుమారు 1.58 లక్షల మంది వెళ్లినట్లు అంచనా వేశారు.
ఈ నగరాలకు భలే డిమాండ్
హైదరాబాద్ నుంచి విదేశాల పర్యటనకు వెళ్లేవారిని పరిశీలిస్తే.. అత్యధికులు సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ నగరాలకు వెళ్లినట్లు తెలిసింది. తర్వాత కౌలాలంపూర్, లండన్, ఆమ్‌స్టర్‌డ్యామ్ నగరాలకు పర్యటన చేసినట్లు తేల్చారు. మన దేశంలో గోవా, కేరళ, ఊటీ, కొడైకెనాల్, కులు, మనాలీ వంటి ప్రదేశాలను చుట్టివచ్చేందుకు గ్రేటర్ వాసులు మక్కువ చూపుతున్నారని చెబుతున్నారు.
మధ్య తరగతిలో భలే క్రేజీ
కాస్మొపాలిటన్ నగరంగా మారిన గ్రేటర్‌లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలతోపాటు ఐటీ, బీపీఓ, కేపీఓ, రియల్టీ, సేవా రంగాల్లో పనిచేస్తున్నవారు ఇటీవలికాలంలో విమాన ప్రయాణాలంటే మక్కువ చూపుతున్నారు. వారి అభిరుచికి, బడ్జెట్‌కు తగినట్లుగా కాక్స్‌అండ్ కింగ్స్, థామస్ కుక్, యాత్రా డాట్‌కామ్, సదరన్ ట్రావెల్స్, బుకింగ్ డాట్‌కామ్ వంటి టూరిస్టు ఆపరేటర్లు, ఆన్‌లైన్ బుకింగ్ ఏజెన్సీలు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. దీంతో విమానాల్లో పర్యాటక, దర్శనీయ స్థలాలకు వెళ్లేవారి సంఖ్య బాగా పెరుగుతోంది.
Advertisement