
ఓయూ తెలంగాణ ప్రజల సంపద
ఉన్నత విద్యను రాజకీయాలతో చూడొద్దు
విద్యార్థి జేఏసీ నేతల హితవు
ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం ప్రభువు తెలంగాణ ప్రజలకు అందించిన సంపద అని విద్యార్థులు పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిజాం నవాబు విశాలమైన ప్రదేశంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్ విశ్వవిద్యాలయాలు రాజ దర్బార్లా అని వ్యాఖ్యానించడం ఆయన మొండితనానికి, అహంకారానికి నిదర్శనమని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు విమర్శించారు. యూనివర్సిటీకి వందల ఎకరాల స్థలం వద్దని ముఖ్యమంత్రి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థి జేఏసీనాయకుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...
- ఉస్మానియా యూనివర్సిటీ
కొనడానికి కుదరదు
గతంలో ఓయూ భూములను వివిధ అవసరాలకు కొందరు కొనాలని, మరికొందరు ఆక్రమించి సొంతం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావు. ఎందుకంటే 1993లో నియమించిన జస్టిస్ చెన్నప్పరెడ్డి కమిటీ ప్రకారం ఓయూ భూములు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తీసుకునేందుకు వీలులేదు.ఈ భూములన్నీ నిజాం నవాబు రాజ్యం స్వయం ప్రతిపత్తి గల ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీద రికార్డు చేశారు. వ్యక్తి గత పట్టాలకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ఓయూ భూములను ఆక్రమించిన అనేక మంది బడానేతలు భూమి పట్టాల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వీటిని సీఎం కేసీఆర్ కొంటే అదే గతి పడుతుంది.
- ప్రొ.భట్టు సత్యనారాయణ, ఔటా అధ్యక్షుడు
తెలంగాణ విద్యార్థులకే హక్కు
వంద సంవత్సరాల చరిత్ర గల ఓయూ భూములపై తెలంగాణ చదివే ప్రతి విద్యార్థికి హక్కు ఉంది. స్వయంప్రతిపత్తి గల ఓయూ భూములను తీసుకునేందుకు ఎవరికీ హక్కు లేదు. పేదల ఇళ్ల నిర్మాణానికి విద్యార్థులు వ్యతిరేకం కాదు. కానీ ఓయూ భూములలోనే నిర్మిస్తామని విద్యార్థులను రెచ్చగొడితే సహించేది లేదు. ఓయూ విద్యార్థుల ఆందోళన ఫలితంగానే సాధించిన రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ వారినే విమర్శిస్తే రాజకీయ భవిషత్తు ఉండదు.
బాబులాల్‌నాయక్
టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు
ఓయుూ భూవుుల జోలికి వస్తే సహించం...
ఓయూ పట్ల వ్యతిరేక భావనను సీఎం కేసీఆర్ మానుకోవాలి. ఉన్నత విద్య పరిశోధనలకు నిలయమైన విశ్వవిద్యాలయాలను మరింత అభివృద్ధిచేసి ప్రపంచ స్థాయికి తీసుకవెళ్లాసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఓయూ భూములుల్లో ఇళ్లు నిర్మిస్తామని సాధ్యంకాని ప్రకటనలతో క్యాంపస్‌లో విద్యా వాతావరణానికి విఘాతం కల్గించవద్దు. ప్రస్తుతం ఓయూ నెల కొన్న పరిస్థితులకు సీఎం కేసీఆర్ కారణం. వర్శిటీలో వీసీ, పాలక మండలి సభ్యులను తక్షణం నియమించి సమస్యలను పరిష్కరించాలి. ఓయూ భూముల జోలికి వస్తే సహించేది లేదు.
చనగాని దయాకర్
పీడీఎస్‌యూ విజృంభణ రాష్ట్ర నాయకులు
జనం దృష్టి మళ్లించేందుకే...
విశ్వ విద్యాలయ భూములపై సీఎం కేసీఆర్ వింత వాదనలు చేస్తూ నగర వాసులను ప్రభావితం చేస్తున్నారు. ధరల పెరుగుదల, పన్నుల పెంపు, ఇతర సమస్యల నుంచి నగర వాసుల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి చౌకబారు వాగ్దానాలు చేస్తున్నారు.
- పున్న కైలాష్ నేత, ఓయూ విద్యార్థి జేఏసీ ఛైర్మన్
ఆ ఆలోచనను విరమించుకోండి
ఓయూ భూములలో ఆరంతస్తుల మేడలు నిర్మించాలనే ఆలోనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలి. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే ఓయూ విద్యార్థులకు ఆనందమే. కానీ నగరంలో అనేక చోట్ల వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా... వర్సిటీలలోనే పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడం అన్యాయం.
- కళ్యాణ్, టి.విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్
ఓట్ల కోసం సీఎం పాట్లు
నగర వాసుల ఓట్ల కోసం సీఎం కేసీఆర్ పడుతున్న వివిధ రకాల పాట్లలో పేదలకు ఇళ్ల నిర్మాణం అనే హామీ ఒకటి. నగరంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభావం లేదని తెలుసుకున్న కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడుతూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. ఓయూ విద్యార్థులతో పెట్టుకుంటే తన కుర్చీకే ముప్పు వస్తుందని తెలుసుకుంటే మంచింది.
- కోటూరి మానవత రాయ్, టి.విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు
కేసీఆర్ పాలనపై నిరంతర పోరు
సీఎం కేసీఆర్ పాలనపై నిరంతరం పోరుకు సిద్ధం. ఏడాదిలోనే ఆయన పాలన విసుగు పుట్టిస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు ఇతర వర్గాలూ అసంతృప్తితో ఉన్నారు. ఉన్నత విద్య, పరిశోధనల అభివృద్ధికి కృషి చేయకుండా... పూర్తిస్థాయి వీసీలను, పాలక మండలి సభ్యులను నియమించకుండా ఉద్యమ గడ్డ ఉస్మానియాను తన సొంత ఆస్తిగా పరిగణిస్తూ మేడలు కడతామని గాలి మాటలు చెప్పడం సిగ్గుచేటు.
- విజయ్ యాదవ్- తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు