సాక్షి, సిటీబ్యూరో: నగరంలో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. తెలంగాణ ఏర్పాటుపై ద్వంద్వ విధానాలతో ఉన్న పార్టీ అధ్యక్షుని వైఖరితో ఇప్పటికే విసిగిపోయిన తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జి పదవులు, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు లభించకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామం టూ వారు ఏకంగా చంద్రబాబుకే సవాల్ విసురుతున్నా రు.
బుధవారం సనత్‌నగర్ నియోజకవర్గ నాయకుడు కూన వెంకటేశ్‌గౌడ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాయకులు సదాశివయాదవ్ తదితరులు బాబు నివాసం ఎదుటే ఆందోళనలకు దిగడం తదితర పరిణామాలు ఈ క్రమంలోనే జరిగాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు లభిస్తాయనే ఆశతో ఎంతోకాలంగా ఆయా నియోజకవర్గాలను అంటిపెట్టుకొని ఉన్న నగర నాయకులు తమకు టిక్కెట్లు రాని పక్షంలో అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధమవుతున్నారు.
సనత్‌నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు బుధవారం చంద్రబాబు నివాసం ఎదుటే ఆందోళనలకు దిగగా.. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అంబర్‌పేట నియోజవర్గం నుంచి అవకాశం కల్పించాలంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం రమేశ్ ఇప్పటికే తన డిమాండ్ అధ్యక్షుడికి వినిపించారు. ఈ నియోజకవర్గం టికెట్‌ను కృష్ణయాదవ్‌కు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉండగా, ఇదే నియోజకవర్గం నుంచి వనంతో పాటు దుర్గాప్రసాదరెడ్డి మరికొందరు ఆశలు పెట్టుకున్నారు.
అన్ని చోట్లా అదే పరిస్థితి...
ముషీరాబాద్ నియోజవర్గంలో పార్టీ మాజీ అధ్యక్షుడు ముఠాగోపాల్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెన్ శ్రీనివాస్‌లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు తలసాని వీరిలో ఎమ్మెన్‌కు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. టికెట్ రానివారు అసమ్మతి బావుటా ఎగురవేయడం.. అవసరమైతే వేరే పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గోషామహల్‌లోనూ ఇదే పరిస్థితి. జిల్లా నాయకులు ప్రేంకుమార్‌ధూత్, ఆనంద్‌కుమార్‌గౌడ్, బుగ్గారావులు ఆ సీటును ఆశిస్తున్నారు.
ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగతా ఇద్దరు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్‌వైపు మొగ్గుచూపుతుండగా, మిగతావారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానికేతరుడైన మాగంటికి బదులు స్థానికంగా ఉన్న ముగ్గురు కార్పొరేటర్లు మురళిగౌడ్, సదాశివయాదవ్, విజయలక్ష్మిలలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, లేని పక్షంలో మాత్రం సహించేది లేదని బాహటంగానే చెబుతున్నారు. ఇప్పటికే వారు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
మలక్‌పేట నియోజకవర్గం నుంచి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితోపాటు నియోజకవర్గ ఇన్ ఛార్జి ముజఫర్ అలీ తదితరులు టికెట్‌ను ఆశిస్తున్నారు. కార్వాన్, నాంపల్లి, తదితర నియోజకవర్గాల్లోనూ పోటీ ఉన్నప్పటికీ, వాటిపై గెలుపు ఆశలు లేకపోవడంతో అసమ్మతులు బయటకు రావడం లేదు. ఏకంగా పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ, ఆందోళనలకు దిగడం నగరపార్టీలో గతంలో లే దు.
ఇటీవలి కాలంలోనే ఈ తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. ఎంతోకాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమను కాదని వేరేవారికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే నగరంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. పార్టీ కార్యాలయం వైపు వస్తున్నవారే లేరు. ఈ నేపథ్యంలో.. రగులుతున్న వ్యతిరేకతతో పార్టీ తీవ్ర ఇరకాటంలో పడింది. ఇదిలా ఉండగా, సనత్‌నగర్ ఇన్‌చార్జి బాధ్యతల్ని పార్టీ అధ్యక్షుడు తలసానికే ఇవ్వడంతో పాటు. అసెంబ్లీ టికెట్‌ను కూడా ఆయనకే ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
‘దేశం’లో తిరుగు‘బావుటా’!
Published Fri, Nov 8 2013 4:08 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement