అసెంబ్లీ ప్రాంగణంలోకి రోజా
ఇన్‌చార్జి కార్యదర్శికి హైకోర్టు ఉత్తర్వులు అందజేత
చాలా హ్యాపీగా ఉందన్న రోజా
రోజాకు స్వాగతం పలికిన సహచర ఎమ్మెల్యేలు
నేటి నుంచి సమావేశాలకు హాజరవుతానన్న నగరి ఎమ్మెల్యే
హైదరాబాద్ : సస్పెన్షన్ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలోకి కూడా రాకూడదని ఆంక్షలు విధించగా శాసనసభకు దూరంగా ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా.. తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు కాపీని తీసుకుని అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో న్యాయవాదులు ఇందిరా జైసింగ్, నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిలతో కలసి అసెంబ్లీకి వచ్చారు. ఆమెకు సహచర పార్టీ ఎమ్మెల్యేలు ఎదురేగి ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికారు. తర్వాత నేరుగా వెళ్లి అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణని కలసి కోర్టు ఉత్తర్వులను అందజేశారు. ఉత్తర్వులు తనకు అందినట్లు ఆయన ఒక కాపీ ఇచ్చారు.రోజా వెంట ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, విశ్వాసరాయి కళావతి, ఉప్పులేటి కల్పన, కళత్తూరు నారాయణస్వామి, సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. రోజాను మహిళా ఎమ్మెల్యేలు కౌగలించుకుని హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
ఇక అసెంబ్లీకి హాజరవుతా
శుక్రవారం నుంచి తాను శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె ఎమ్మెల్యేలతో కలసి మాట్లాడుతూ.. తనపై సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసిందని సంతోషంగా చెప్పారు. చివరకు న్యాయం గెలిచిందని, దీంతో తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం రెట్టింపు అయిందన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ అనుచిత నిర్ణయం వల్ల తన హక్కులకు భంగం కలగడమే కాకుండా, తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా త్వరితగతిన తాను హైకోర్టుని ఆశ్రయించినట్లు చెప్పారు. ఎప్పటిలాగే శుక్రవారం నుంచి 9 గంటలకు అసెంబ్లీకి వస్తానని, నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై ఇప్పటివరకూ కోల్పోయిన సమయాన్ని అనుబంధ ప్రశ్నలు వేయడానికో, జీరో అవర్‌లో మాట్లాడ్డానికో అవకాశం ఇస్తారని భావిస్తున్నానన్నారు. హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ అధికార పార్టీ వారు మాట్లాడితే ఆ విషయం కోర్టు చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.గతంలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్ బెయిల్ విషయంలో కూడా సోనియాను మెప్పించి బెయిల్ తెచ్చుకున్నారని చంద్రబాబు న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడారని రోజా గుర్తు చేశారు.హైకోర్టు తీర్పును వక్రీకరించేలా టీడీపీ వ్యాఖ్యలు చేయడం దారుణమని, వాటితో టీడీపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని తెలుస్తోందన్నారు. ఇంకా తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మళ్లీ న్యాయస్థానంలో పోరాడతానన్నారు.
ద్వారం వద్ద ఉద్రిక్తత
ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున మహిళా మార్షల్స్‌తో పాటు పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద, ఇన్‌చార్జి కార్యదర్శి కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజా వాహనాన్ని అసెంబ్లీ ఆవరణలోకి అనుమతించిన పోలీసులు వెనుకే వచ్చిన న్యాయవాదుల వాహనాన్ని అడ్డగించారు. న్యాయవాదులు కోర్టు ఉత్తర్వులు చూపించినా వారు ఖాతరు చేయకపోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. తర్జనభర్జనల అనంతరం లోపలికి పంపాలని నిర్ణయించారు. మీడియాను కూడా కొంత సేపు అనుమతించలేదు.