ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం | RTC driver committed suicide | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Published Wed, Aug 23 2017 12:48 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

RTC driver committed suicide

డిపో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు
 
హైదరాబాద్‌: కుషాయిగూడ ఆర్టీసీ బస్‌ డిపోలో పనిచేస్తున్న ఓ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు...నల్లగొండ నుంచి డిçప్యుటేషన్‌పై గత 12 ఏళ్లుగా కుషాయిగూడ బస్‌ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న బొల్లంపల్లి తిరుపతిరెడ్డి (48) గత ఏడాది మేలో ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు. డ్రైవర్‌గా విధులు నిర్వహించేందుకు అన్‌ఫిట్‌గా వైద్యులు నిర్థారించడంతో 16 నెలలుగా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాడు.

డ్రైవర్‌గా కాకుండా ప్రత్యామ్నాయంగా అవకాశం కల్పించాలని గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన డిపో మేనేజర్‌తో పాటు ప్రస్తుత డిపో మేనేజర్లను పలుమార్లు కోరినప్పటికీ ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన తిరుపతి రెడ్డి సోమవారం ఘట్‌కేసర్‌లో పురుగు మందు తాగి అపస్మారకస్థితిలో రోడ్డు ప్రక్కన పడిపోయాడు. అక్కడి పోలీసులు సమాచారమివ్వటంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని ఆస్పత్రిలో చేర్పించారు. డిపో అధికారుల నిర్లక్ష్యంతోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భార్య రమాదేవి, కుమారుడు విజయ్‌ ఆరోపిస్తున్నారు.

కాగా, ఈ విషయంపై కుషాయిగూడ డిపో మేనేజర్‌ రమేశ్‌ను వివరణ కోరగా తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. శ్రామిక్‌ కేటగిరీలో అవకాశం కల్పించాలన్న ఆయన అభ్యర్థన మేరకు పై అధికారులు గత ఏడాది జూన్‌ 20న అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆయన నల్లగొండ నుంచి డిçప్యుటేషన్‌పై వచ్చారు కాబట్టి ఆయన ఫైల్‌ను నల్లగొండకు పంపినట్లు తెలిపారు. తిరుపతిరెడ్డికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న నల్లగొండ డిపో అధికారులపైనే బాధ్యత ఉంటుందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement