సచిన్ రిటైర్మెంట్ నిర్ణయంపై అభిమానుల ఆవేదన | Sachin Tendulkar's retirement announcement concerns from fans | Sakshi
Sakshi News home page

సచిన్ రిటైర్మెంట్ నిర్ణయంపై అభిమానుల ఆవేదన

Published Fri, Oct 11 2013 4:59 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Sachin Tendulkar's retirement announcement concerns from fans

సాక్షి, సిటీస్పోర్ట్స్ : టెస్ట్ మ్యాచ్‌లకు గుడ్ బై చెబుతూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తీసుకున్న నిర్ణయంపై నగరంలో సచిన్ అభిమానులు ప్చ్... అనేశారు. మరికొంతకాలం ఆడి ఉంటే బావుండేదని కొందరు పేర్కొంటే... రిటైర్మెంట్ తర్వాత క్రికెట్‌లో భారతదేశాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దే అకాడమీని ఏర్పాటు చేయాలని మరికొందరు సూచించారు. సచిన్‌కు భాగ్యనగరంతో ఎంతో అనుబంధం ఉంది.  

అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టక ముందే జింఖానా మైదానంలో ముంబై - హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన అనేక మ్యాచ్‌ల్లో సచిన్ పాల్గొని రాణించాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లోనూ  హైదరాబాద్‌లో సచిన్‌కు అనేక రికార్డులున్నాయి. సచిన్ హైదరాబాద్‌లో న్యూజిల్యాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడినప్పటికి పెద్దగా పరుగులేవీ సాధించలేదు. ఆయన టెస్ట్ మ్యాచ్‌ల్లో కంటే వన్డే రికార్డులకు హైదరాబాద్ ప్రధాన వేదికగా ఉపయోగపడింది.


హైదరాబాద్‌లో తొలి అడుగులివే..
 
1988-89 రంజీ సీజన్‌లో సచిన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగెట్టాడు. ఇదే సీజన్‌లో 1989 ఫిబ్రవరి 3 నుంచి హైదరాబాద్- బొంబాయి జట్ల మధ్య సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగిన నాలుగు రోజుల ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం సచిన్ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చాడు. దిలీప్ వెంగ్‌సర్కార్ కెప్టెన్‌గా వ్యహరించిన బొంబాయి జట్టులో సచిన్‌తో పాటు రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, చంద్రకాంత్ పండిట్, లాల్‌చంద్ రాజ్‌పుత్, రాజు కులకర్ణి తదితరులు జట్టు సభ్యులుగా ఉన్నారు.

 హైదరాబాద్ జట్టులో అజారుద్దీన్, అర్షద్ అయూబ్, వెంకటపతిరాజు, ఎం.వీ.శ్రీధర్, ఎంవీ నర్సింహరావు, అ బ్దుల్ అజీం, వివేక్ జైసింహ వంటి క్రికెటర్లు పాల్గొన్నారు. బాంబే జట్టు ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్ సందర్భంగా జిం ఖానా మైదానంలోని హెచ్‌సీఏ డ్రెస్సింగ్ రూంలో సచిన్‌తో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఫోటోలు దిగారు.
 
ప్యారడైజ్ బిర్యానీ అదిరిందన్న సచిన్

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఆడేందుకు 2003-2004లో హైదరాబాద్ వచ్చిన సచిన్ ప్యారడైజ్ బిర్యానీ రుచి చూశారు. గ్రాండ్ కాకతీయ హోటల్‌లో బస చేశారు. సచిన్ ప్యారడైజ్‌కు వచ్చి బిర్యానీ తినేందుకు సిద్ధం కాగా సెక్యూరిటీ కారణాలతో భద్రతా సిబ్బంది వారించారు. దీంతో ప్యారడైజ్ హోటల్ నుంచి బస చేసిన హోటల్‌కే హైదరాబాద్ మటన్ బిర్యానీ తెప్పించుకుని టేస్ట్ చేశారు. బిర్యానీ తీసుకుని వెళ్లిన హోటల్ మేనేజర్ శాబిర్‌ఖాన్‌తో సచిన్ మాట్లాడుతూ బిర్యానీ టేస్ట్ చాలా బాగుందని మెచ్చుకున్నారు.
 
 1999లో ఎల్బీ స్టేడియంలో న్యూజిల్యాండ్‌పై జరిగిన వన్డేలో 186 పరుగులతో నాటౌట్.
 
 2009లో ఆస్ట్రేలియాతో జరిగిన హీరోహోండా కప్ మ్యాచ్‌లో కేవలం 141 బంతుల్లో 175 పరుగులు సాధించాడు.
 
 2003లో న్యూజిల్యాండ్‌పై 102 పరుగులతో 36వ సెంచరీ చేశాడు.
 
 క్రికెట్ చరిత్రలోనే ఎవర్‌గ్రీన్..
 ప్రపంచ క్రికెట్ చర్రితలోనే సచిన్ ఎవర్‌గ్రీన్. నా జీవితంలో సచిన్ వంటి కష్టజీవి, నైపుణ్యం గల క్రికెటర్‌ని ఎవరినీ చూడలేదు. సచిన్ రిటైర్మెంట్ క్రి కెట్ ప్రియులకు తీరని లోటు. కానీ, సచిన్ ఓ క్రికెటర్‌గా, మంచి మనిషిగా ప్రజలందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారు.
 - బస్వరాజ్, బీసీసీఐ డాటా మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్
 
 భావి క్రికెటర్లకు ఆదర్శం..
 భావి క్రికెటర్లకు సచిన్ టెండూల్కర్ ఆదర్శంగా నిలుస్తారు. సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో చాలామంది క్రీడాకారులు రాణిస్తున్నారు. భారత క్రికెట్ టీంలో సచిన్ లోటు పూరించలేనిది. ఆటతోనే కాదు సమాజ సేవల్లోనూ సచిన్ ఎప్పుడూ ముందుంటాడు.
 - ఎంవీ. శ్రీధర్, హెచ్‌సీఏ సెక్రటరీ
 
 సచిన్ సేవలు మరువలేనివి
 భారత క్రికెట్ టీంను ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్‌గా నిలపడంలో సచిన్ కృషి ఎనలేనిది. సచిన్ మైదానంలో దిగుతున్నాడంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. ఈ విషయాన్ని స్వయానా ఆస్ట్రేలియన్ మేటి బౌలర్ షేన్ వార్న్ ఒప్పుకున్నాడంటే సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సేవలను ఎవరూ మరిచిపోలేరు.
 - అక్షంత్‌రెడ్డి, హైదరాబాద్ రంజీ టీం కెప్టెన్
 
 వినేందుకు బాధగా ఉన్నా..
 ప్రపంచమంతా గర్వించతగ్గ గొప్ప క్రీడాకారుడు సచిన్. ప్రతి క్రీడాకారునికి రిటైర్‌మెంట్ తప్పనిసరి. అయితే సచిన్ లాంటి గొప్ప వ్యక్తి సేవల్ని రిటైర్‌మెంట్ అనంతరం ఉపయోగించుకునే అంశం ప్రభుత్వం, బీసీసీఐ చేతుల్లో ఉంటుంది. సచిన్ రిటైర్‌మెంట్ ప్రకటన వినేందుకు బాధగా ఉన్నా.. ఆయన ఇతర మార్గాల్లో క్రీడారంగానికి సేవ చేయాలని కోరుకుంటున్నా.
 - సైనా నెహ్వాల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement