సాహితీ సిరులు
చిన్నారుల కోసం స్టోరీ టెల్లింగ్... సూట్‌కేసులో తరలివచ్చిన జర్మనీ! ‘ఈరోజు దినపత్రిక రేపటి చిత్తుకాగితం సరే అందులో వచ్చిన వార్త కూడా అలా వదిలేయాల్సిందేనా?’ అంటూ ప్రశ్నించే న్యూస్‌బ్రీడ్... నగరాన్ని లెన్సుల్లో బంధించి ఒక్క ఫొటోతో చరిత్ర చెప్పిన హైడ్ అండ్ సీక్... ఒకటేమిటి... హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో ఆకట్టుకున్న, ఆలోచింపజేసిన విశేషాలెన్నో! వాటి వివరాలు.
విజువల్ స్టోరీటెల్లింగ్
‘పాము తోక తానే తినటం మొదలుపెట్టింది. మధ్యలో ఆగి చూసుకుంటే కాని తిన్నది తన తోకే అని తెలియలేదట. ఇదే పరిస్థితి నేడు అడవులకు పట్టింది’ 9వ తరగతి చదువుతున్న చిన్నారి పాము కథను నేటి వాస్తవ పరిస్థితులతో పోల్చి చెప్పిన వైనం ఇది.
‘అమ్మ చీమను చంపింది, తన ముగ్గురు పిల్లలు చూస్తుండగా..’ ఈచిన్న వాక్యాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రించారు మరికొందరు విద్యార్థులు. ‘దేవుడు ఈగను పుట్టింటాడు, కానీ ఎందుకు పుట్టించాడో చెప్పటం మరిచాడు’ చిత్రాన్ని చూసి చెప్పిన వ్యాఖ్య. చదివిన వాటిని ఊహించి చిత్రించడం, అప్పటికే గీసి ఉన్న చిత్రాలపై వాఖ్యానాలు చెప్పడం వల్ల... పిల్లలలో చదివే ఆసక్తిని పెంచవచ్చంటూ విజువల్ స్టోరీటెల్లింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు గౌరీనోరీ.
50 మందికి పైగా పిల్లలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని కథలకు, పద్యాలకు చిత్ర రూపమిచ్చారు. ఎలా చదువుకోవాలి?, చదివిన దానిని ఎలా అర్థం చేసుకోవాలి? అనే అంశాన్ని బోధించారామె. ఊహించుకోవటం నుంచి క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుందటారు గౌరీ.
సూట్‌కేసులో జర్మనీ..
జర్మనీకి వెళ్లాలంటే సూట్‌కేసు సర్దుకోవాలి. అదేం అక్కర్లేకుండా హెచ్‌ఎల్‌ఎఫ్‌కి వచ్చే పిల్లల కోసం జర్మనీనే ఓ సూట్‌కేసులో వచ్చింది. జర్మనీ ప్రాచుర్యంలో గల ప్రాంతాలు, ప్రముఖంగా చేసే వృత్తులు, అక్కడి ఆవిష్కరణలు, అలవాట్లు ఇలా అన్నీ ఒక డబ్బాలో సర్ది ప్రదర్శించారు. మరో బాక్స్‌లో జర్మనీ భాషకు సంబంధించిన వివిధ గేమ్స్ ఆడే అవకాశం కల్పించారు.
భాష తెలియకపోయినా ఈ ఆటలో పాల్గొన్ని పిల్లలందరూ జర్మనీ పదాలు, వాటి అర్థాలను చిత్రాల ద్వారా కరెక్టుగా గుర్తించటం ఆశ్చర్యం కలిగించిందన్నారు ఈ బాక్స్ పర్యవేక్షకురాలు రాజేశ్వరి. భావం తెలిస్తే భాష నేర్చుకోవటం కష్టం కాదని ఈ బాక్స్ ద్వారా తెలిసిపోయింది.
ది న్యూస్ బ్రీడ్
తెల్లారితే సూర్యుడు వచ్చాడో లేదో చూడటం కన్నా ముంగిట్లో పేపర్ వచ్చిందో లేదో చూసుకోవటం చాలా ముఖ్యం. అలా పేపర్‌ద్వారానో, టీవీలో వచ్చే డిస్కషన్ ద్వారానో తెలుసుకున్న వార్తల గురించి ఆలోచించటం పక్కన పెట్టి మళ్లీ మన పనుల్లో మనం మునిగిపోతాం.
ఎవరికో సంబంధించిన విషయాల్లాగా తెల్లారే సరికి ఆ వార్తలను మన మెమరీలో నుంచి తుడిచేస్తాం. ఇలా వార్తలను కూడా మనం ఆస్వాదించే టీ, బిస్కెట్‌తో సమానంగా మారిపోయాయా? వార్తల పట్ల స్పందించటం అందరి బాధ్యత కాదా? ఈ ఆలోచనను ఎంతో క్రియేటివ్‌గా ప్రదర్శించారు కండ్రూ శివకేశవ్.
స్పేస్ అండ్ సెన్సిబిలిటీస్..
హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫుట్‌పాత్‌లు, ప్లేగ్రౌండ్స్, పార్క్స్‌లాంటి పబ్లిక్ ప్రదేశాలు అన్యాక్రాంతమవుతుంటాయి. అలాంటి వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్న స్పృహ పిల్లల్లో కల్పించడానికి నిర్వహించిన వర్క్‌షాపే స్పేస్ అండ్ సెన్సిబిలిటీస్! పబ్లిక్ స్పేస్‌లు, పాత్‌వేలను అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో ఎంత అద్భుతంగా మలచొచ్చో ఇందులో అవగాహన కల్పిస్తామన్నారు వర్క్‌షాప్ నిర్వాహకురాలు ప్రముఖ ఆర్కిటెక్ట్ గౌరీ మోహిని.