సాహితి, మేఘ
ఈ చిరునవ్వుల్ని చూడండి. విహంగమై ఎగరాలన్నంతగా.. వీల్ చెయిర్‌కే ఆశను కల్పించేలా ఉన్నాయి! జీవితంలో స్పీడ్ బ్రేకర్‌లు ఉండేవే. కొన్నిసార్లు దారే ఉండదు. ‘‘ప్రయాణం మాత్రం సాగాల్సిందే’’ అంటారు సాహితీ, మేఘ. నిస్పృహకు అందనంత ఎత్తులో నిరాశను చేరనీయని ఉత్సాహంతో స్ఫూర్తిగా నిలుస్తున్న అక్కచెల్లెళ్లు వీళ్లు. కాలాన్నే కదలించే చక్రాలు!
సాహితీ శ్రీవత్ససకు వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా ఒకరి సాయం అవసరం. అలాంటిది ఒంటరిగా మనాలి మంచు జల్లులను మనసారా ఆస్వాదించి వచ్చారు! వెబ్ కంటెంట్ రైటర్‌గానూ రాణిస్తున్నారు. మేఘ కూడా సొంతంగా కాళ్ల మీద నిలబడే అవకాశం లేకపోయినా ప్రైవేట్ జాబ్ చేస్తూ స్వీయ సంపాదన పొందుతున్నారు. విధి వీల్ చెయిర్‌కే పరిమితం చేసినా లక్ష్య పెట్టని వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉంటున్న సాహితీ, మేఘ అటాక్సియా అనే సమస్యతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా జీవితాన్ని సవాల్‌గా తీసుకోవడం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. సాహితి వయసు 29 ఏళ్లు. మేఘ వయసు 33. పన్నెండేళ్ల క్రితం అటాక్సియా వీరిని నడవటానికి లేకుండా చేసింది. అయినప్పటికీ తమ కలలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తున్నారు. తమలాంటి వారిలో గుండె నిబ్బరం నింపుతున్నారు.
ప్రయాణాలే శక్తి
సాహితి వీల్ చెయిర్ నుంచే బ్లాగర్‌గానూ, వెబ్ కంటెంట్ రైటర్‌గానూ వర్క్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో రోజూ భగవద్గీత క్లాసులు వింటారు. ‘రాహ్’ అని ఒక ఎంజీవోకు వర్క్ చేస్తున్నారు. ఆ సంస్థ ద్వారా డిసేబుల్డ్ వాళ్లందరికీ మనోధైర్యం, ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. దీపావళి తర్వాత జో«ద్‌పూర్‌లో ‘రాహ్’ క్యాంపెయిన్‌కి వెళ్లబోతున్నారు సాహితి. ‘‘మేం చేస్తున్న పనుల్లో ట్రావెల్ కూడా ముఖ్యమైనదే. నార్మల్‌గా ఉన్నవారే ప్రయాణాలంటే కష్టపడుతుంటారు. అలాంటిది డిజేబుల్డ్ పర్సన్స్ ప్రయాణాలు చేయడం అంటే కుదురుతుందా? అయినప్పటికీ వారు ఒకేదగ్గర ఉండిపోకూడదని ‘టూర్స్’ కూడా ప్లాన్ చేస్తుంటాం’’ అని చెప్పారు సాహితి. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి టూర్స్‌కి వెళ్లారు సాహితి. మనాలి చూడాలని ఆమెకు ఎప్పటి నుంచో ఆశ.
అక్కడి మంచును చేత్తో తాకాలని ఆరాటం. తల్లిదండ్రులకు చెబితే ముందు వద్దన్నారు. ఒప్పిస్తే తర్వాత సరేనన్నారు. ‘‘డిజేబుల్డ్ గ్రూప్‌లో మెంబర్‌గా ఉన్నాను కాబట్టి వాలెంటీర్స్‌ను మాట్లాడుకున్నాను. బయట కూడా వాష్‌రూమ్స్ తప్ప వేరే అవసరం పడదు. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు చెక్ చేసుకున్నాను. టికెట్స్, రూమ్ బుకింగ్.. అన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లో కారు దిగగానే నా కోసం మా గ్రూపు వాలంటీర్ ఒకరు సిద్ధంగా ఉన్నారు. అక్కడ నాకు కావాల్సిన సాయం చేసి వెళ్లిపోయారు. ముందే అన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకోవడంతో ఇబ్బంది అనిపించలేదు. మూడు రోజులు మనాలీ వెళ్లి వచ్చాను. అక్కడి ‘స్నో’ చూడాలన్న నా ఆశ తీరింది. రోప్‌వే, యార్క్ ఎక్కాను. కరోనా తగ్గాక కామాఖ్య మందిరం (అస్సాం) వెళ్లాలనేది ఇప్పుడున్న ప్లాన్’’ అని తెలిపారు సాహితీ.
మొదట సాహితి అక్క మేఘకు ఇంటర్ సెకండియర్ చదువుతున్నప్పుడు ఇలా నిలబడలేని పరిస్థితి వచ్చింది. ఆమెది బైపీసీ. డాక్టర్ అవాలని ఆ గ్రూపు తీసుకుంది. ఆ తర్వాత ఫార్మసీ వైపు వెళ్లాలని తన ఉద్దేశం. కానీ అటాక్సియా వల్ల కుదర్లేదు. దీంతో ‘‘డిస్టెన్స్‌లో బి.ఎ చేశాను. జాబ్ రిక్రూటర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. వర్క్ చేసే చోట లిఫ్ట్ సదుపాయం ఉండేది. నాన్న రోజూ తీసుకెళ్లి సీటులో కూచోబెట్టి వచ్చేవారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. న్యూరో సమస్య అన్నది ఒక డిజార్డర్. కానీ, అది మన మనోబలాన్ని తగ్గించలేదు. ఇలాంటి డిజార్డర్ ఉన్నవారికి మానసికంగా, శారీరకంగా ఫిట్‌నెస్ ఉండాలి. నాలాంటి వారికి ఫిట్‌నెస్ సూచనలతోపాటు ఫిజియోథెరపీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పారు మేఘ.
నైపుణ్యాలే నడక
సాహితి తర్వాత ఇంకో అమ్మాయి కూడా ఉంది. మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఉమ్మడి కుటుంబం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండేవారు. స్కూలు హిమాయత్ నగర్‌లో. బస్సులో వెళ్లివచ్చేవారు. చివరమ్మాయి ఇప్పుడు అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేస్తోంది. ‘‘అక్క (మేఘ) ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు తరచూ కిందపడిపోయేది. నడవలేకపోతుంటే డాక్టర్‌కి చూపించారు. అటాక్సియా అని చెప్పారు. నాక్కూడా.. బీటెక్‌లో ఉండగా నా నడకలో తేడా ఉందని నాకే అనిపించింది. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇంట్లో కూడా. ఘట్కేసర్‌లో కాలేజీ. బీటెక్ చివరి సంవత్సరంలో మాత్రం చాలా కష్టమయ్యింది. హాస్పిటల్‌కి వెళితే ‘పెద్దమ్మాయికి వచ్చిన సమస్యే ఈమెకూ ఉంది’ అన్నారు! అప్పటికే జాబ్స్‌కి ట్రై చేశాను. కానీ, రోజూ ఆఫీసుకు వెళ్లడం కష్టమని ఆగిపోయాను. ఇంటి నుంచే ఫ్రీ లాన్స్ చేయడం మొదలుపెట్టాను. కంటెంట్ రైటర్‌గా అవార్డులూ అందుకున్నాను. మాకున్నది శారీరక లోపం. కానీ, జీవన నైపుణ్యాలు ఉన్నాయి. వాటి మీదే ఫోకస్ చేస్తే వేరే లోపాలేవీ కనిపించకుండా పోతాయి. ముందు మన మైండ్ సెట్‌నిæమార్పు చేసుకోవాలి’’ అని నవ్వుతూ చెప్పింది సాహితీ.
న్యూరో సమస్య అన్నది ఒక డిజార్డర్. కానీ, అది మన మనోబలాన్ని తగ్గించలేదు. ఇలాంటి డిసార్డర్ ఉన్నవారికి మానసికంగా, శారీరకంగా ఫిట్‌నెస్ ఉండాలి. నాలాంటి వారికి ఫిట్‌నెస్ సూచనలతోపాటు ఫిజియోథెరపీ ఇవ్వాలనుకుంటున్నాను. – మేఘ
జీవన నైపుణ్యాల మీదే ఫోకస్ చేస్తే వేరే లోపాలేవీ కనిపించకుండా పోతాయి. ముందు మన మైండ్ సెట్‌నిæ ఛేంజ్ చేసుకోవాలి. – సాహితి
పిల్లలే మా ధైర్యం
పెద్ద పాపకు ఈ సమస్య వచ్చినప్పుడు ఇక జీవితమే లేదనుకున్నాం. ఏం చేయాలో అర్ధం కాదు. ఇప్పడైతే ఇక మా పిల్లల ధైర్యానికి నేనూ ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఇలాంటి వాళ్లను మా పిల్లల ద్వారానే కొంతమందిని కలిశాను. మొదట్లో గోడలు పట్టుకుని నడిచేవాళ్లు, తర్వాత చెయిర్ పట్టుకుని నడిచేవాళ్లు. ఇప్పుడు అస్సలు నడవలేరు. మమ్మల్ని ఆనందంగా ఉంచాలని పిల్లలు, వాళ్లు ఆనందంగా ఉండాలని మేమూ... రోజూ ప్రయత్నిస్తూనే ఉంటాం. సాహితీ మనాలి వెళ్తాననీ, తన పుట్టిన రోజుకు అక్కడ ఉండాలనీ అన్నప్పుడు మొదట వద్దన్నాను. తర్వాత కాదనలేకపోయాను. సంతోషంగా తిరిగి వచ్చింది. మేఘా, సాహితీ చండీగడ్ కూడా వెళ్లి వచ్చారు.
– లలితా రంగాచారి (సాహితి, మేఘల తల్లి)
– నిర్మలారెడ్డి
ఫొటోలు: దేవేంద్రనాథ్
Comments
Please login to add a commentAdd a comment