ముగిసిన సాహిత్యోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మూడు రోజుల పాటు సందడిగా సాగిన ‘హైదరాబాద్ సాహితీ ఉత్సవాలు’ ఆదివారం ఘనంగా ముగిశాయి. ఎంతోమంది దేశ, విదేశీ ర చయితలు తమ అనుభవాలను, రచనలను నగర సాహితీ ప్రియులకు అందించారు. చివరిరోజు ఉత్సవాల్లో ప్రధాన వేదిక ఆషియానా వద్ద ‘జెండర్ టేల్స్’ పేరిట సాహిత్యంలో ‘స్త్రీవాదం’పై సునితి నమ్ జోషి, ఊర్వశి బుతల్యా ప్రసంగించారు. ‘ఏ లైఫ్ ఇన్ ఫిలిమ్స్’ పేరిట కాంచన్‌ఘోష్, విపిన్ శర్మలు చలనచిత్రాల్లో జీవన చిత్రణపై వివరించారు.
పబ్లిషర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మిని కృష్ణన్, ఊర్వశి బుతల్యాలు ప్రసంగించారు. ప్రస్తుతం పత్రికల్లో పుస్తక సమీక్షలకు స్థానం కుచించుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనువాద సమస్యలపై సబా మహ్మద్ బషర్, సస్ క్యాజైన్, శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో, భాషల్లో ఉండే వైవిద్యం వల్ల అన్నిభాషలు, సంస్కృతి ప్రత్యేకత కలిగి ఉంటాయని, అనువాదకులు స్థల కాలలకు అనుగుణంగా పదాలను వాడాలని పేర్కొన్నారు. ప్రముఖ దళిత రచయిత్రులు బామా, శివలక్ష్మి దళిత సాహిత్య ఆవశ్యకత, తీరుతెన్నులపై తమ అనుభవాలను ‘దళిత్ వాయిస్’లో పంచుకున్నారు.
నగర మహిళల జీవనచిత్రం ‘ది షాడో ఉమెన్’
ఫెస్టివల్ వేదికపై సీనియర్ ఐఏఎస్ అధికారి చందనాఖన్ రచించిన ‘ది షాడో ఉమెన్’ పుస్తకాన్ని బెంగాలీ రచయిత సుబోధ్ శంకర్ ఆవిష్కరించారు. పాతబస్తీ స్త్రీల జీవనం ఆధారంగా ఆమె ఈ ఆంగ్ల కథల సంకలనాన్ని రాశారు. సుబోధ్ మాట్లాడుతూ.. అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే రచన.. చిత్రలేఖనాలను కొనసాగిస్తున్న చందనాఖన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడారు.
బంజారాహిల్స్/శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌లైన్: సప్తపర్ణిలో నిర్వహించిన థియేటర్ వర్క్‌షాప్‌లో రంగస్థలంపై నటించేటప్పుడు నటులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ప్రముఖ ఐరిష్ నటుడు, నాటక శిక్షకుడు క్యాథల్ క్విన్ వివరించారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాన్ రోజన్ స్టాక్.. బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన అద్భుతమైన ఫొటోలకు గాబ్రియెల్ రోజన్ స్టాక్ రాసిన భావుకత నిండిన హైకు కవితలను జోడించడం ఆహుతులను అలరించింది.
అలరించిన కథలు
ఆదివారం స్కూళ్లకు సెలవు కావడంతో వందలాదిగా తరలివచ్చిన చిన్నారులతో సాహితీ వీధులు కళకళలాడాయి. లామకాన్, కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో జరిగిన స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రముఖ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ చిన్నారులకు ఉత్సాహం నింపే కథలను వినిపించారు. దీనికి పెద్దలు కూడా హాజరయ్యారు.
భాగ్యనగరి జీవనంపై..
లామకాన్‌లో నిర్వహించిన ‘క్రియేటివ్ రైటింగ్’ వర్క్‌షాప్‌కు విశేష ఆదరణ లభించింది. రచనల నిపుణురాలు మధు కజ ‘హౌ టు గెట్ స్టార్టెడ్’ పేరిట రచనలు ఏ విధంగా రాయాలి.. ఏ అంశానికి యే విషయాలు రాస్తే రచనలు బాగుంటాయో వివరించారు. ఈ వర్క్‌షాపులో పలువురు వర్థమాన రచయితలు హాజరయ్యారు. మధ్యాహ్నం ఆనంద్‌రాజు వర్మ రచించిన ‘హైదరాబాద్- మెహలే’, ‘గలిస్ అండ్ కుచెస్’ పుస్తకాలపై చర్చించారు.
ఇలాంటి ఉత్సవాలు అవసరం..
ఇప్పటి వరకు పలు చిత్రాలకు, ఆల్బమ్స్‌కు సంగీతం అందించాను. ఒక సంగీత దర్శకుడిగా సంగీతాన్ని అందించడమే కాకుండా సాహిత్యంలోని అర్థాన్ని వివరిస్తూ ప్రేక్షకుడికి పాటలు అందించాలి. రచనలు రాయడం అనేది చాలా కష్టమైన పని. ఈ లిటరరీ ఫెస్టివల్‌లో క్రియేటివ్ రైటింగ్‌పై పలు విషయాలను నేర్చుకున్నాను. ఏ విధంగా రచనలు చేయాలో మధు కజ చాలా చక్కగా వివరించారు. ఇలాంటి ఫెస్టివల్స్ మరిన్ని నిర్వహించాలి.
- సత్య కశ్యప్, సంగీత దర్శకుడు
కొత్త విషయాలు నేర్చుకున్నా..
హైదరాబాద్‌లో ఇలాంటి లిటరరీ ఫెస్టివల్ నిర్వహించడం శుభ పరిణామం. ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలకు గేయ రచయితగా వ్యవహరిస్తున్నాను. పాటలు సందర్భానుసారంగా రాయడం అనేది మెదడుకు పదును పట్టే అంశం. ఈ వర్క్‌షాప్ ద్వారా కొన్ని మెళకువలు నేర్చుకోగలిగాను. లోతుగా విశ్లేషించడం, ఎక్కడ ఏ పదాలు ఉపయోగించాలో తెలుసుకున్నాను.
- హర ఉప్పాడ, సినీ గేయ రచయిత