క్రిమినల్ లాయర్‌గా పూరీ సోదరుడు
హైదరాబాద్ : ఇప్పటి వరకు ప్రేమికుడు, రోమియో, పోకిరీ తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్... తాజాగా 'వాడు నేను కాదు' చిత్రంలో క్రిమినల్ లాయర్ పాత్రను పోషించనున్నాడు. ఆ చిత్ర షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నికి వినోద్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ క్రిమినల్ లాయర్ బిగ్ పజిల్‌ను ఎలా ఛేదించాడు అనేది ఈ చిత్రం ద్వారా చూడవచ్చని చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో తెలిపింది.
తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, భోజ్‌పూరి భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సాయిరాం శంకర్‌కి దర్శకుడు విజయన్‌కు మధ్య గత కొద్ది సంవత్సరాలుగా ఈ చిత్ర కథపై జరిగాయని... అయితే అవి ఇటీవల కొలిక్కి రావడంతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైందని వివరించింది. నటి మహిమ నంబియార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పింది. అలాగే మరో నటిని ఎంపిక చేయవలసి ఉందని... అందుకోసం ఇప్పటికే చిత్ర దర్శకుడు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారని పేర్కొంది. వివిధ చిత్రాలకు పని చేసి పలు అవార్డులు అందుకున్న ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారని చిత్ర యూనిటి తెలిపింది. ఈ చిత్రంలో సాయిరాం ద్విపాత్రాభినయం చేయనున్నాడు.