
ఉత్సాహంగా ‘సాక్షి’ యూత్ ఫెస్ట్
ఆడిపాడిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: డ్రమ్స్ బీట్స్ దుమ్మురేపుతుంటే... వెస్ట్రన్ ట్యూన్స్ అడుగులు కదిపి ఆడించేశాయి. రసరమ్యమైన సంగీత ఝరిలో కుర్రకారు తమను తాము మైమరిచిపోయారు. ఆకాశమే హద్దుగా... ఆనందమే విందుగా ఆస్వాదించేశారు. యువతలో దాగివున్న కళను వెలికితీయడానికి గండిపేటలోని సీబీఐటీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన ‘సాక్షి ఎరీనా వన్’ యూత్ ఫెస్ట్ నవోత్సాహంతో అదిరిపోయింది.
‘బజాజ్ పల్సర్ ఇండియా నంబర్‌వన్ బైక్’ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫెస్ట్‌లో వివిధ కళాశాలలకు చెందిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చదువుతోపాటు తమకు నచ్చిన కళారంగంలో ప్రతిభ చాటి ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. తొలిరోజు నిర్వహించిన ‘బాటిల్ ఆఫ్ బ్యాండ్ అండ్ ఇనుస్ట్రుమెంటల్ సోలో’లో ఎవరికెవరూ తీసిపోనంతగా పోటీపడ్డారు. ఆహూతుల నుంచి అభినందనలు అందుకున్నారు.
బ్రాస్‌బ్యాండ్ కేటగిరీలో హైదరాబాద్‌లోని గీతం వర్సిటీ, టీకే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి రెండు గ్రూపులు పోటీపడ్డాయి. వీటితోపాటు సోలో కేటగిరీలో మరో ఆరుగురు గిటారు, పియానో ప్లేతో వీనులవిందు చేశారు. కార్యక్రమంలో ‘సాక్షి’ మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి మాట్లాడుతూ... తరగతి గదులకు పరిమితమైన కళాశాలల విద్యార్థులను ప్రపంచానికి పరిచయం చేయాలన్న సదుద్దేశంతో ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు.
విద్యార్థుల అభిరుచులకు ఇది చక్కటి వేదికన్నారు. సీబీఐటీ కళాశాల ప్రిన్సిపాల్ చెన్నకేశవరావు మాట్లాడుతూ ‘సాక్షి’ మీడియా నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్‌కు తమ కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. పోటీల న్యాయనిర్ణేతలుగా విజయ్ వాడ్రేవు, అరుణ్ రుబె న్ వ్యవహరించారు. మొత్తం ఏడు విభాగాల్లో 30 రకాల పోటీలు ఈ ఫెస్ట్‌లో నిర్వహిస్తారు. వచ్చే నెల 21 వరకు నగరంలోని వివిధ వేదికల్లో ఈ పోటీలు జరుగుతాయి.