మాది అక్కాచెల్లెళ్ల బంధం
హింగిస్ గురించి సానియా
* తదుపరి లక్ష్యం ఫ్రెంచ్ ఓపెన్
సాక్షి, హైదరాబాద్: మహిళల డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడమే తన తదుపరి లక్ష్యమని ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యాఖ్యానించింది. రియో ఒలింపిక్స్ సన్నాహకాలపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డబుల్స్ విజేతగా నిలిచిన అనంతరం స్వస్థలం తిరిగొచ్చిన సానియా సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడింది. ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే డబుల్స్‌లో తన కెరీర్ గ్రాండ్‌స్లామ్ కల నెరవేరుతుందని సానియా చెప్పింది. ‘నా తదుపరి లక్ష్యం కచ్చితంగా ఫ్రెంచ్ ఓపెనే.
అది గెలిస్తే నా లక్ష్యం పూర్తవుతుంది. అయితే అంత సులభం కాదు. నిజాయితీగా చెప్పాలంటే అది మాకు అన్నింటికంటే కష్టమైన వేదిక. నేనూ, హింగిస్ ఇద్దరమూ క్లే కోర్టులో బలహీనం. అయితే తీవ్రంగా శ్రమించి సాధించాలనే పట్టుదలగా ఉన్నాం’ అని ఆమె వెల్లడించింది. 2015 అద్భుతంగా గడిచిందని, ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తే చాలనుకున్న తనకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో అద్భుతమైన ఆరంభం లభించిందని తెలిపింది. 2016లో కనీసం మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గుతామని విశ్వాసం వ్యక్తం చేసింది.
హింగిస్‌తో ఆరంభంలో జత కట్టినప్పుడు కేవలం తాము కోర్టులో భాగస్వాములుగానే వ్యవహరించామని, ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా ఆ బంధం దృఢం కావడంతోనే ఈ వరుస విజయాలు సాధ్యమయ్యాయని ఆమె గుర్తు చేసుకుంది. ‘మా ఇష్టాఇష్టాలు కూడా కలవడంతో కోర్టు బయట కూడా మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇది అక్కాచెల్లెళ్ల మధ్య బంధంలా మారింది. ఆమెకు ప్రత్యర్థిగానే మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్స్ ఆడాల్సి రావడంతో ఎంతో భావోద్వేగానికి గురయ్యాం. లాకర్ రూమ్‌లో కలిసినప్పుడు ఏడుపొక్కటే తక్కువ. మరుసటిరోజు ఇద్దరం కలిసి మళ్లీ ఫైనల్స్ ఆడాల్సి రావడం అంటే అది ఎలాంటి సమయమో అర్థం చేసుకోవచ్చు’ అని సానియా మీర్జా చెప్పింది.
బిజీగా ఉండే డబ్ల్యూటీఏ షెడ్యూల్లో ఒలింపిక్స్ కోసమంటూ 4-5 నెలలు వృథా చేయలేమని, అది చేరువలో ఉన్న సమయంలోనే భాగస్వామి గురించి నిర్ణయం తీసుకుంటానని సానియా స్పష్టం చేసింది. ‘పేస్, బోపన్నలలో ఎవరితో కలిసి ఆడాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. దానికి చాలా సమయముంది. కటాఫ్ తేదీనాటికి నేను టాప్-10లో ఉంటానని నమ్మకముంది గానీ వారిద్దరి ర్యాంకింగ్ గురించి నేను చెప్పలేను.
మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకానికి ఎంత అవకాశం ఉందో... ఫెడరర్, జొకోవిచ్‌లాంటి ఆటగాళ్లు బరిలోకి దిగితే ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది’ అని మీర్జా విశ్లేషించింది. తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నానన్న సానియా, గెలిచినప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అసంఖ్యాక సందేశాలు వస్తాయని, ఓడినప్పుడు తిట్లకూ కొదవ ఉండదని చెప్పింది.
అరుదైన గౌరవం: భారత ప్రభుత్వం తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపట్ల సానియా అమితానందం వ్యక్తం చేసింది. ‘నాకు ముందుగా సమాచారం లేదు. నేను ఈ అవార్డును ఊహించలేదు. ట్విట్టర్‌లో కొంత మంది అభినందించడం ప్రారంభించడంతో తెలిసింది. ఆ తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా ఫోన్ వచ్చిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఏ అవార్డు గొప్పతనం దానిదే. గతంలో న్యూయార్క్‌నుంచి వచ్చి మరీ ఖేల్త్న్ర అందుకున్నా. ఈ సారీ టోర్నీ లేకపోతే ఎక్కడున్నా వచ్చి తీసుకుంటా’ అని వెల్లడించింది.