career goals
-
పనిచేయడానికి ఇదే బెస్ట్ కంపెనీ..
ముంబై: దేశంలో పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీగా టీసీఎస్ గుర్తింపు పొందింది. పనిచేయడానికే కాకుండా, కెరీర్లో పురోగతికీ టీసీఎస్ మెరుగైన కంపెనీగా లింక్డ్ఇన్ 2023 నివేదిక తెలిపింది. టీసీఎస్ తర్వాత అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ లింక్డ్ఇన్ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది లింక్డ్ఇన్ జాబితాలో టెక్ కంపెనీల ఆధిపత్యం ఎక్కువగా ఉండగా, ఈ ఏడాది జాబితాలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఆర్థిక సేవల కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రొఫెషనల్ సేవలు, తయారీ, గేమింగ్ కంపెనీలకూ చోటు దక్కింది. 25 కంపెనీల్లో 10 ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్ నుంచే ఉన్నాయి. మాక్వేర్ గ్రూప్ 5వ స్థానంలో ఉంటే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 11, మాస్టర్‌కార్డ్ 12, యుబి 14వ స్థానంలో నిలిచాయి. 20వ స్థానంలో డ్రీమ్11, 24వ స్థానంలో గేమ్స్ 24/7 ఉన్నాయి. ఈ జాబితాలో గేమింగ్ కంపెనీలకు చోటు లభించడం మొదటిసారి. ఈ రంగానికి పెరుగుతున్న ప్రజాదరణను ఇది తెలియజేస్తోంది. ఇన్స్టంట్ గ్రోసరీ డెలివరీ సంస్థ జెప్టో 16వ స్థానం దక్కించుకుంది. ఈ తరహా నైపుణ్యాలకు డిమాండ్.. లింక్డ్ఇన్ జాబితాలో చోటు సంపాదించుకున్న టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం చూస్తున్నాయి. ఫైనాన్షియల్ రంగానికి చెందిన కంపెనీలు కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రోత్ స్ట్రాటజీస్ తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇండస్ట్రియల్ డిజైన్, గేమ్ డెవలప్మెంట్ నిపుణులకూ డిమాండ్ నెలకొంది. ఇంజనీరింగ్, కన్సల్టింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, విక్రయాలు, డిజైన్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌పై ఎక్కువగా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే కంపెనీలు, ఆ తర్వాత ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, పుణెకు చెందినవి నిపుణులను నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. -
మాది అక్కాచెల్లెళ్ల బంధం
హింగిస్ గురించి సానియా * తదుపరి లక్ష్యం ఫ్రెంచ్ ఓపెన్ సాక్షి, హైదరాబాద్: మహిళల డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడమే తన తదుపరి లక్ష్యమని ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యాఖ్యానించింది. రియో ఒలింపిక్స్ సన్నాహకాలపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డబుల్స్ విజేతగా నిలిచిన అనంతరం స్వస్థలం తిరిగొచ్చిన సానియా సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడింది. ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే డబుల్స్‌లో తన కెరీర్ గ్రాండ్‌స్లామ్ కల నెరవేరుతుందని సానియా చెప్పింది. ‘నా తదుపరి లక్ష్యం కచ్చితంగా ఫ్రెంచ్ ఓపెనే. అది గెలిస్తే నా లక్ష్యం పూర్తవుతుంది. అయితే అంత సులభం కాదు. నిజాయితీగా చెప్పాలంటే అది మాకు అన్నింటికంటే కష్టమైన వేదిక. నేనూ, హింగిస్ ఇద్దరమూ క్లే కోర్టులో బలహీనం. అయితే తీవ్రంగా శ్రమించి సాధించాలనే పట్టుదలగా ఉన్నాం’ అని ఆమె వెల్లడించింది. 2015 అద్భుతంగా గడిచిందని, ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తే చాలనుకున్న తనకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో అద్భుతమైన ఆరంభం లభించిందని తెలిపింది. 2016లో కనీసం మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గుతామని విశ్వాసం వ్యక్తం చేసింది. హింగిస్‌తో ఆరంభంలో జత కట్టినప్పుడు కేవలం తాము కోర్టులో భాగస్వాములుగానే వ్యవహరించామని, ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా ఆ బంధం దృఢం కావడంతోనే ఈ వరుస విజయాలు సాధ్యమయ్యాయని ఆమె గుర్తు చేసుకుంది. ‘మా ఇష్టాఇష్టాలు కూడా కలవడంతో కోర్టు బయట కూడా మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇది అక్కాచెల్లెళ్ల మధ్య బంధంలా మారింది. ఆమెకు ప్రత్యర్థిగానే మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్ ఆడాల్సి రావడంతో ఎంతో భావోద్వేగానికి గురయ్యాం. లాకర్ రూమ్‌లో కలిసినప్పుడు ఏడుపొక్కటే తక్కువ. మరుసటిరోజు ఇద్దరం కలిసి మళ్లీ ఫైనల్స్ ఆడాల్సి రావడం అంటే అది ఎలాంటి సమయమో అర్థం చేసుకోవచ్చు’ అని సానియా మీర్జా చెప్పింది. బిజీగా ఉండే డబ్ల్యూటీఏ షెడ్యూల్లో ఒలింపిక్స్ కోసమంటూ 4-5 నెలలు వృథా చేయలేమని, అది చేరువలో ఉన్న సమయంలోనే భాగస్వామి గురించి నిర్ణయం తీసుకుంటానని సానియా స్పష్టం చేసింది. ‘పేస్, బోపన్నలలో ఎవరితో కలిసి ఆడాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. దానికి చాలా సమయముంది. కటాఫ్ తేదీనాటికి నేను టాప్-10లో ఉంటానని నమ్మకముంది గానీ వారిద్దరి ర్యాంకింగ్ గురించి నేను చెప్పలేను. మిక్స్డ్ డబుల్స్‌లో పతకానికి ఎంత అవకాశం ఉందో... ఫెడరర్, జొకోవిచ్‌లాంటి ఆటగాళ్లు బరిలోకి దిగితే ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది’ అని మీర్జా విశ్లేషించింది. తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నానన్న సానియా, గెలిచినప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అసంఖ్యాక సందేశాలు వస్తాయని, ఓడినప్పుడు తిట్లకూ కొదవ ఉండదని చెప్పింది. అరుదైన గౌరవం: భారత ప్రభుత్వం తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపట్ల సానియా అమితానందం వ్యక్తం చేసింది. ‘నాకు ముందుగా సమాచారం లేదు. నేను ఈ అవార్డును ఊహించలేదు. ట్విట్టర్లో కొంత మంది అభినందించడం ప్రారంభించడంతో తెలిసింది. ఆ తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా ఫోన్ వచ్చిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఏ అవార్డు గొప్పతనం దానిదే. గతంలో న్యూయార్క్‌నుంచి వచ్చి మరీ ఖేల్త్న్ర అందుకున్నా. ఈ సారీ టోర్నీ లేకపోతే ఎక్కడున్నా వచ్చి తీసుకుంటా’ అని వెల్లడించింది.