ముంబై: దేశంలో పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీగా టీసీఎస్ గుర్తింపు పొందింది. పనిచేయడానికే కాకుండా, కెరీర్‌లో పురోగతికీ టీసీఎస్ మెరుగైన కంపెనీగా లింక్డ్‌ఇన్ 2023 నివేదిక తెలిపింది. టీసీఎస్ తర్వాత అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ లింక్డ్‌ఇన్ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది లింక్డ్‌ఇన్ జాబితాలో టెక్ కంపెనీల ఆధిపత్యం ఎక్కువగా ఉండగా, ఈ ఏడాది జాబితాలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఆర్థిక సేవల కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రొఫెషనల్ సేవలు, తయారీ, గేమింగ్ కంపెనీలకూ చోటు దక్కింది.
25 కంపెనీల్లో 10 ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్ నుంచే ఉన్నాయి. మాక్వేర్ గ్రూప్ 5వ స్థానంలో ఉంటే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 11, మాస్టర్‌కార్డ్ 12, యుబి 14వ స్థానంలో నిలిచాయి. 20వ స్థానంలో డ్రీమ్11, 24వ స్థానంలో గేమ్స్ 24/7 ఉన్నాయి. ఈ జాబితాలో గేమింగ్ కంపెనీలకు చోటు లభించడం మొదటిసారి. ఈ రంగానికి పెరుగుతున్న ప్రజాదరణను ఇది తెలియజేస్తోంది. ఇన్‌స్టంట్ గ్రోసరీ డెలివరీ సంస్థ జెప్టో 16వ స్థానం దక్కించుకుంది.
ఈ తరహా నైపుణ్యాలకు డిమాండ్..
లింక్డ్‌ఇన్ జాబితాలో చోటు సంపాదించుకున్న టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం చూస్తున్నాయి. ఫైనాన్షియల్ రంగానికి చెందిన కంపెనీలు కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రోత్ స్ట్రాటజీస్ తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇండస్ట్రియల్ డిజైన్, గేమ్ డెవలప్‌మెంట్ నిపుణులకూ డిమాండ్ నెలకొంది. ఇంజనీరింగ్, కన్సల్టింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, విక్రయాలు, డిజైన్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌పై ఎక్కువగా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే కంపెనీలు, ఆ తర్వాత ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, పుణెకు చెందినవి నిపుణులను నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment