
హైదరాబాద్: రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, విద్య నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలోని ఐసీఎస్‌ఎస్‌ఆర్ హాలులో ఇంటి పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం తెలంగాణ స్టూడెంట్ యూనియన్(టీఎస్‌యూ) క్యాడర్ క్యాంప్ జరిగింది. కేజీ టు పీజీ ఉచితవిద్య, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాల భర్తీ వంటి సమస్యల పరిష్కా రంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రభుత్వ మెడలు వంచైనా సమస్యల పరిష్కారానికి టీఎస్‌యూ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనే డిమాండ్లపై మార్చి 1 నుంచి ప్రగతి భవన్‌కు లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నిర్బంధ విధానాలను మానుకొని రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమాదిగ, ప్రొఫెసర్ నర్సయ్య, టీఎస్‌యూ నాయకులు రాంచందర్, హరీశ్, వెంకట్, శేఖర్, నవీన్, విజయ్ పాల్గొన్నారు.