సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, శాఖ కమిషనర్ జగన్‌మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయిలను డైరెక్టర్లుగా నియమించింది. కార్పొరేషన్‌కు రూ.200 కోట్లతో మూలధన నిధిని ఏర్పాటు చేసింది.
ఇందులో గవర్నర్ పేరుతో రూ.199,99,99,300ను, మిగతా మొత్తాన్ని బోర్డు డైరెక్టర్ల పేరిట కేటాయించింది. అయితే కార్పొరేషన్‌కు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం.. చైర్మన్ పోస్టును ప్రస్తుతానికి ఖాళీగా ఉంచింది. చైర్మన్ నియామకంతోపాటు పలువురు జిల్లా సమన్వయ సమితి సభ్యులను డైరెక్టర్లుగా నియమించనున్నారు. ఈ పేర్లను తరువాత ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతు సమన్వయ సమితి ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్ కొనసాగనున్నారు.
ఇవీ ప్రధాన మార్గదర్శకాలు..
♦ రాష్ట్రంలో ప్రధానమైన వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు అనుగుణంగా పంట కాలనీలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలి.
♦ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పండించిన ఆహార పదార్థాల సరఫరా.
♦ రైతు సమితుల సభ్యులకు శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేయడం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు పంపడం.
♦ సన్న, చిన్నకారు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి సాగు ఖర్చు తగ్గించడం.
♦ వ్యవసాయాభివృద్ధిలో సహకారం కోసం జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఐకార్ వంటి సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవడం. ఎప్పటికప్పుడు వారి సలహాలతో ముందుకు సాగడం.
♦ జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, ఉద్యాన సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం.
♦ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం.
♦ సహకార సంఘాలను, రైతు శిక్షణ సంస్థలను/కేంద్రాలను బలోపేతం చేయడం.
♦ రాష్ట్ర గణాంక శాఖ/వ్యవసాయ, ఉద్యా నవర్సిటీల సహకారంతో ఏటా పంటల ఉత్పత్తిని అంచనా వేసి.. పంటల కొనుగోలుకు ఏర్పాట్లు చేయడం.
♦ రైతుల ఆదాయం పెంచేందుకు పంట కోతల అనంతర నష్టాలు తగ్గేలా చర్యలు చేపట్టడం. ఇందుకోసం ప్రాసెసింగ్, అదనపు విలువ జోడింపు వంటివి చేపట్టడం. స్థానిక అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడం.
♦ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు.
♦ ప్రైవేటు పరిశ్రమలతో కలసి పీపీపీ పద్ధతిలో పనిచేయడం. వ్యాపారులు, ఇతర సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం.
♦ ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కృషి.
30 జిల్లాలకు సంబంధించి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు
రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి జిల్లా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఆయా జిల్లాల జాబితాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించిన అనంతరం.. ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
కార్పొరేషన్ లక్ష్యాలు, ఉద్దేశాలివీ..
♦ వ్యవసాయ రంగాన్ని వేగంగా అభివృద్ధిపర్చడం
♦ వివిధ పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం
♦ రాష్ట్రంలో రెండో హరిత విప్లవం తరహాలో కీలక అడుగు వేయడం
♦ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం
♦ కేంద్ర సంస్థలతో కలిసి ఆయా పంటలను కొనుగోలు చేయడం
♦ మార్కెట్‌లో మద్దతు ధర లభించనపుడు జోక్యం చేసుకుని మంచి ధర అందేలా చూడడం
♦ ఆహార పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ చేపట్టడం ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడం
♦ నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం
♦ అవసరమైతే సొంత ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడం
♦ వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కలసి పనిచేయడం
Comments
Please login to add a commentAdd a comment