ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడా కంపెనీల ప్రయోజనాల కోసమే పని చేస్తోందన్నారు. కార్మిక సంఘం పెట్టుకోవటానికి కొత్త నిబంధనలు విధించి కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. దేశం లో కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రోడ్డు రవాణా, భద్రత-2014’ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆటో, ట్రాలీ, మినీట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఈ-చలాన్ల బకాయిలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎ.నరేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు వెంకన్న, ప్రధాన కార్యదర్శి బాలనర్సింహ, సభ అధ్యక్ష వర్గం సభ్యులు కె.అశోక్, తెలంగాణ శ్రీను, ఎం.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక భద్రత చట్టాన్నిఅమలు చేయాలి
అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టాన్ని అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమ్ ఆద్మీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో రౌడ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ దేశంలో 96 శాతం మంది అసంఘటిత రంగంలో పని చేస్తున్నారని, వారికి ఎలాంటి రక్షణ, హక్కులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను ఐక్యం చేస్తేనే వారి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్.వెంకట్ రెడ్డి, నాయకులు గోల్కొండ రత్నం, ఐ.మైసయ్య, కామేశ్వర్ రావు, ఆర్‌కే గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్
Published Mon, Jan 5 2015 2:25 AM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM
Advertisement