
ఏదీ మీ ‘సర్వీస్’?
బొగ్గు సరఫరా సంస్థపై సర్వీస్ ట్యాక్స్ దాడులు
సిటీబ్యూరో: నగరం కేంద్రంగా పని చేస్తున్న ఓ ప్రముఖ బొగ్గు సరఫరా సంస్థపై సర్వీస్ ట్యాక్స్ విభాగం సోమవారం దాడులు చేసింది. ఆ సంస్థకు చెందిన రెండు కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు.. రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ప్రధాన కార్యాలయం ఉన్న ఓ కార్పొరేట్ సంస్థ బొగ్గు సరఫరా వ్యాపారంలో ఉంది. సిమెంట్, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న 35 పేరున్న ప్రైవేట్ సంస్థలతో పాటు నాలుగు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలకూ వీరు బొగ్గును సరఫరా చేస్తున్నారు. ఆర్థిక చట్ట ప్రకారం వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్లు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన... ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి.
ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆ సంస్థలు ఈ మొత్తాన్ని సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. బొగ్గును సేకరించి, సరఫరా చేస్తున్న ఈ సంస్థ సైతం వాణిజ్య అవసరాలకు సేవలు అందిస్తున్నట్లేనని సర్వీస్ ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు. ఈ తరహా వ్యాపారంపై ఏటా 12.36 శాతం (ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 14 శాతం) పన్నును ఆ సంస్థ తన క్లైంట్స్ నుంచి వసూలు చేసి... ఆ మొత్తాన్ని సర్వీస్ ట్యాక్స్ విభాగానికి జమ చేయాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు సక్రమంగా లేవని సర్వీస్ ట్యాక్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సంస్థకు చెందిన సోమాజిగూడ, బంజారాహిల్స్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. లావాదేవీలకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నామని... వాటి ఆధారంగా సర్వీస్‌ట్యాక్స్ బకాయిలు లెక్కించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.