హైకోర్టు ఆగ్రహంతో... దిగొచ్చిన సర్కారు
సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనల్లోని ఆదాయ రహస్యాలు వెల్లడిస్తాం
* హైకోర్టు ముందు మెమో దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
* సవరణ నోటిఫికేషన్ ఇస్తామని న్యాయస్థానానికి నివేదన
* బిడ్ల సమర్పణకు తగిన గడువునిస్తామన్న ప్రభుత్వం
* ‘తగిన గడువు’ అంటే సరిపోదన్న న్యాయమూర్తి
* గడువును పెంచి తీరాల్సిందేనని తేల్చిచెప్పిన కోర్టు
* అర్హత నిబంధనలను సవరించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది
* విచారణ మంగళవారానికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ‘స్విస్ ఛాలెంజ్’ విధానంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు సంబంధించిన ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండా అత్యంత గోప్యత పాటిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది.
స్విస్ ఛాలెంజ్ విధానం, ప్రభుత్వ గోప్యతపై హైకోర్టు మూడు రోజుల క్రితం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు సంబంధించిన ఆదాయ వివరాలను బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ మెమోను న్యాయస్థానం ముందుంచింది. ఆ మెమోను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆదాయ వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా బిడ్ల సమర్పణకు గడువును కూడా పెంచాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆదాయ వివరాలను బహిర్గతం చేస్తూ జారీ చేసే నోటిఫికేషన్, బిడ్ల సమర్పణకు గడువు పెంపుదలకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్‌కు చెందిన అసెండాస్-సెమ్‌బ్రిడ్జ్-సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్టియం స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు పోటీగా ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ‘ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ డెరైక్టర్ బి.మల్లికార్జునరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ టెండర్ నోటిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తన అనుబంధ పిటిషన్‌లో కోరారు. ఈ అనుబంధ పిటిషన్‌పై ఈ నెల 23న వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
మెమో దాఖలు చేయండి
మధ్యంతర ఉత్తర్వులను వెలువరించేందుకు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు సంబంధించిన ఆదాయ వివరాలను బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనికి పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. బిడ్‌ల సమర్పణకు గడువును పెంచాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతేకాక అర్హత నిబంధనలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశాన్ని మళ్లీ పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పారు. ఆదాయ వివరాలను బహిర్గతం చేసే విషయాన్ని ఓ మెమో ద్వారా రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని అడ్వొకేట్ జనరల్‌కు సూచిస్తూ విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే ఏజీ ఓ మెమోను న్యాయమూర్తి ముందుంచారు.
సవరణ నోటిఫికేషన్ చూడకుండా ఎలా స్పందిస్తారు?
మెమో ఆధారంగా ఆదాయ వివరాలను బహిర్గతం చేస్తూ సవరణ నోటిఫికేషన్‌ను సోమవారం కోర్టు ముందుంచుతామని ఏజీ చెప్పారు. అయితే, దీనికి న్యాయమూర్తి అంగీకరించలేదు. కేసును రేపటికి (శని వారం) వాయిదా వేస్తానని, అప్పటికల్లా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. నోటిఫికేషన్‌ను సిద్ధం చేసేందుకు సమయం పడుతుందని ఏజీ అభ్యర్థించారు. నోటిఫికేషన్‌ను సోమవారం కోర్టు ముందుంచుతామని, విచారణను ఆ రోజుకు వాయిదా వేయాలని కోరారు.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. నోటిఫికేషన్‌లోని వివరాలను చూడకుండా బిడ్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. చివరి నిమిషం వరకు నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తే ఎలా అని అన్నారు. శనివారం కల్లా నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు బిడ్‌ల దాఖలకు గడువును సవరిస్తారా? లేదా? స్పష్టం చేయాలని ఏజీకి స్పష్టం చేశారు.
గడువు పెంపు సహేతుకంగా ఉండాలి
పిటిషనర్‌కు అసలు బిడ్ దాఖలు చేసే అర్హత లేదని ఏజీ చెప్పగా, ‘‘పిటిషనర్ సంగతి వదిలేయండి. మిగిలిన ఎంతో మంది ముం దుకొచ్చి ప్రభుత్వం ముందు మంచి ప్రతిపాదనలను ఉంచే అవకాశం ఉంది కదా! ఆదా య వివరాలను బహిర్గతం చేసిన తరువాత వాటిని అధ్యయనం చేసి స్పందించేందుకు వారికి కొంత సమయం పడుతుంది. కాబట్టి గడువును సవరించాల్సిందే’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. బిడ్‌లు దాఖలు చేసేం దుకు తగిన గడువునిస్తామని ఏజీ తెలిపారు. తగిన గడువు అంటే సరిపోదని, గడువు పెంపు సహేతుకంగా ఉండాలే తప్ప, ఓ 24 గంటల సమయం ఇచ్చి గడువు పెంచామని చెబితే సరిపోదని న్యాయమూర్తి అన్నారు.
అర్హత నిబంధనలను సవరించాలి
ఈ సమయంలో ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ప్రతిపాదనలు సమర్పించేందుకు సింగపూర్ కన్సార్టియంకు ప్రభుత్వం ఏడాదిన్నర గడువు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ, పోటీ ప్రతిపాదనల సమర్పణకు మాత్రం బిడ్డర్లకు నామమాత్రపు గడువునిచ్చిందని కోర్టుకు నివేదించారు. ప్రజాధనం వృథా కాకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. అర్హత నిబంధనలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు. బిడ్ దాఖలు చేయాలంటే విదేశాల్లో నిర్మాణ పనులు, మార్కెటింగ్ తదితర అంశాల్లో అనుభవం ఉండాలని ప్రభుత్వం చెబుతోందన్నారు. దేశంలో చేపడుతున్న నిర్మాణాలకు విదేశాల్లో పనిచేసి ఉండాలన్న నిబంధన ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం విదేశాలంటే ఆఫ్రికా దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన కంపెనీలు కూడా పాల్గొనవచ్చని, అభివృద్ధి పరంగా ఆయా దేశాలు భారత్ కంటే వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు.
పిటిషనర్ ఇన్ని రోజులు ఏం చేస్తున్నట్లు?
సూక్ష్మమైన అంశాలతో సహా అన్ని వివరాలను సోమవారం నాటికి కోర్టు ముందు ఉంచుతానని అడ్వొకేట్ జనరల్ శ్రీనివాస్ చెప్పారు. శనివారం కల్లా చెప్పాల్సిందేనని, ఈ విషయంలో ఏజీగా ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సింగపూర్ సమయం మనకన్నా ఆరు గంటలే ముందుందని, వారిచ్చిన ప్రతిపాదనలపై సవరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇంత గడువు ఎందుకని ప్రశ్నించారు. పిటిషనర్‌కు అసలు ఏమాత్రం అర్హత లేదని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని ఏజీ తెలిపారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి చాలా రోజులవుతుంటే పిటిషనర్ ఇప్పటివరకూ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
చివరి నిమిషంలో కోర్టుకు వచ్చి మొత్తం ప్రక్రియను ఆపేయాలనడం సరికాదన్నారు. వివరాల సమర్పణ నిమిత్తం విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరిన అడ్వొకేట్ జనరల్ సాయంత్రం 4.30 గంటలకు తిరిగి కోర్టుకు వచ్చారు. నోటిఫికేషన్ జారీ, గడువు పెంపుపై సోమవారం సాయంత్రాని కల్లా అన్ని విధివిధానాలన్నీ పూర్తవుతాయని అధికారులు తనకు చెప్పారని, అందువల్ల విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఆ రోజున ఈ వ్యాజ్యంపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని దమ్మాలపాటి శ్రీనివాస్‌కు, ప్రకాశ్‌రెడ్డికి స్పష్టం చేశారు.