'ఆ ఇద్దరు మంత్రులను మోదీ బర్తరఫ్ చేయాలి'
హైదరాబాద్ : కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ ఒత్తిళ్ల వల్లే... హెచ్సీయూ నుంచి విద్యార్థులను సస్పెండ్ చేశారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఆ ఇద్దరు మంత్రులను ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో బుధవారం హెచ్సీయూకి సీతారాం ఏచూరి విచ్చేశారు. స్థానిక విద్యార్థులతో మాట్లాడిన అనంతరం సీతారాం ఏచూరి విలేకర్లతో మాట్లాడుతూ... హెచ్సీయూ వీసీని తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు.
అసలు వీసీ నియామకమే రాజకీయంగా జరిగిందని విమర్శించారు. విద్యార్థుల మధ్య గొడవ సమసిపోయాక సదరు విద్యార్థులను సస్పెన్షన్ ఎలా చేశారని ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ కుట్రపూరితంగా జరిగాయని అన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.