నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం | Siviar actions on fake seeds | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం

Published Thu, Oct 6 2016 1:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం - Sakshi

నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం

- వారిపై పీడీ చట్టం ప్రయోగించండి
- సీఎస్, డీజీపీలకు ముఖ్యమంత్రి ఆదేశం
- ‘సాక్షి’ వరుస కథనాలతో స్పందించిన ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు తయారు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పరచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో నకిలీ విత్తనాల విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తన తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగించి ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో నకిలీ విత్తనాల అంశంపై సీఎం సమీక్షించారు. రైతులు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడితే.. నకిలీ విత్తన తయారీదారుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలపై తక్షణమే విచారణ జరిపి మూడు జిల్లాల కలెక్టర్లతో నివేదిక తెప్పించాలని ఆదేశించారు.

పేకాట, గుడుంబా, గుట్కాను తరిమికొట్టడంలో ప్రభుత్వం విజయం సాధించిందని, ఆ తరహాలోనే నకిలీ విత్తన తయారీదారులు పారిపోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలను మార్కెట్‌లో విక్రయించకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తన తయారీదారుల ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశాన్ని చట్టపరంగా పరిశీలించాలని సూచించారు. ప్రజలకు నష్టం చేకూర్చే అక్రమార్కుల విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితిల్లోనూ రాజీపడదని సీఎం స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్లు, ఎస్పీలు సంఘ వ్యతిరేక శక్తులపై పూర్తిస్థాయిలో నిఘాపెట్టే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరిగే కలెక్టర్లు, ఎస్పీల భేటీ ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షించనున్నట్లు తెలిపారు. సమీక్షలో సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ఉన్నతాధికారులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

 నష్టపరిహారంపై స్పష్టత లేమి
 మిరప నకిలీ విత్తనాలు, రైతులు నష్టపోయిన అంశంపై ‘సాక్షి’ వరుసగా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎస్ రాజీవ్‌శర్మ స్పందించి సమగ్ర నివేదికకు, చర్యలకు ఆదేశించిన మరుసటి రోజే వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి చర్యలు చేపట్టారు. నష్టపరిహారం చెల్లింపుపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రైతులు మిరప పంటల సాగు, విత్తనాల కోసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేశారని నివేదికలోనే ప్రస్తావించారు. కాబట్టి రైతులందరికీ కూడా ఆ స్థాయిలో పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంపై వ్యవసాయశాఖ ప్రకటన జారీ చేయలేదు.
 
 ముగ్గురు వ్యవసాయాధికారుల సస్పెన్షన్
 రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టిన విత్తన కంపెనీలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వ్యవసాయాధికారులపై వేటు పడింది. నకిలీ విత్తన కంపెనీల లెసైన్సులు రద్దు అయ్యాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా రైతులు వివిధ కంపెనీల విత్తనాలు వేసి నష్టపోయారు. దీంతో రాష్ట్రస్థాయి శాస్త్రవేత్తల బృందం ఆయా జిల్లాల్లో పర్యటించింది. రైతులను కలసి వ్యవసాయశాఖ కార్యదర్శికి నివేదిక అందజేశారు. అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సంబంధిత కంపెనీల ప్రధాన కార్యాలయాలు, ప్రాసెసింగ్ కేంద్రాలు, గోదాములను ఈ నెల 4న తనిఖీ చేశారు. గ్రీన్ ఎరా, జీవా అగ్రిటెక్స్, క్యాంప్సన్ సీడ్స్, లక్కీ సీడ్స్, అగ్రోజెన్స్, మహానంది సీడ్స్‌పై క్రిమినల్ చర్యలు తీసుకునేలా సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

క్యాంప్సన్ సీడ్స్, లక్కీ సీడ్స్, అగ్రో జెన్స్, మహానంది సీడ్స్ కంపెనీల లెసైన్స్‌లను రద్దు చేసేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పార్థసారథి తెలిపారు. గ్రీన్ ఎరా, జీవా అగ్రి జెనెటిక్స్ కంపెనీల లెసైన్సులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు విత్తన డీలర్ల లెసైన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. ఇక నకిలీ విత్తనాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించినందుకు కుత్బుల్లాపూర్ వ్యవసాయాధికారి జి.ప్రసన్నలక్ష్మి, హైదరాబాద్ అర్బన్ వ్యవసాయాధికారి ఐ.పల్లవి, సరూర్‌నగర్ వ్యవసాయాధికారి సుందరిని సస్పెండ్ చేశారు. ఆ మూడు జిల్లాల్లో డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసేలా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నకిలీ విత్తనాలతో ఈ మూడు జిల్లాల్లో 4,420 ఎకరాల మిరప పంటకు నష్టం వాటిల్లింది. మొత్తం 3,531 మంది రైతులు నష్టపోయారు. వారికి 121 మంది డీలర్లు నకిలీ మిరప విత్తనాలను అంటగట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement