
ఖజానా నింపేద్దాం..
బస్సులు..ఆటోలు..క్యాబ్స్..సినిమాహాళ్లలో ప్రకటనలు ఇచ్చారో పన్ను పడుద్ది. అదనపు ఆదాయ వనరులు సమీకరించుకునేందుకు జీహెచ్‌ఎంసీ మార్గాలను అన్వేషిస్తోంది. చిన్నపాటి ప్రకటనలపైనా పన్ను వేసేందుకు యోచిస్తోంది. సినిమా హాళ్లలో స్లైడ్స్, షార్ట్ ఫిల్మ్స్.. గోడలపై రాతలకూ పన్ను వేసేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్‌ఆర్, మెట్రోరైల్ కారిడార్లల్లో ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది.
వీటి ద్వారా దాదాపు రూ. 50 కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని పధాన నగరాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందిస్తోంది.
⇒ చిన్న ప్రకటనలకూ పన్నులు!
⇒ ఆటోలు, బస్సులనూ వదలరు..
⇒ మెట్రో, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గాలపైనా ప్రత్యేక దృష్టి
⇒ ఏటా రూ. 50 కోట్ల ఆదాయం
⇒ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకూ హోర్డింగులు, గ్లోసైన్ బోర్డులు, ఫ్లెక్సీబోర్డులపై మాత్రమే ప్రకటనల పన్ను వసూలు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఏ రూపేణా (కరపత్రం, క్యారీ బ్యాగులు, సినిమా స్లైలడ్, బస్సులు, ఇతరత్రా వాహనాలపై )ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రకటనల పన్ను వసూలు చేయవచ్చు. ఈ అంశాన్ని ఇంతవరకు పెద్దగా పట్టించుకోని అధికారులు ఇప్పుడు వీటి నుంచీ గణనీయంగా ఆదాయం రాబట్టుకోవచ్చునని అంచనా వేశారు. ప్రకటనలు ప్రదర్శిస్తున్న వారందరి నుంచీ ప్రకటనల పన్ను వసూలు చేసే ఏర్పాట్లలో మునిగారు. ఇందుకుగాను ప్రకటనల పన్నుగా నిర్ణీత రుసుములను ప్రతిపాదించారు.
వీటి ద్వారా ఏటా దాదాపు రూ. 50 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల నుంచి దీన్ని అమలుచేసే యోచనలో ఉన్నారు. గత సంవత్సరం కూడా వాహనాలపై ప్రదర్శించే ప్రకటనలకు పన్ను వసూలు చేయాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ ఆలోచనను తిరిగి తెరపైకి తేవడంతోపాటు ఈసారి అదనంగా సినిమాస్లైలడ్స్ ప్రదర్శించినందుకు కూడా ప్రకటనపన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రతిపాదిత పన్నులు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి.
సంవత్సరానికి ఏ కేటగిరీకి ఎంత ఫీజు..
కేటగిరీల వారీగా హోర్డింగులు, యూని పోల్స్, ఎఫ్‌ఓబీలు, ఆర్చీలపై ప్రకటనలకు దిగువ ఫీజులు వసూలు చేస్తారు.
గోడ పెయింటింగ్‌లకూ పన్ను
గోడలపై వేసే ప్రచార పెయింటింగ్‌లకు, దుకాణాల షట్టర్ల మీది ప్రచారాలకు సైతం ప్రకటనల పన్ను విధించనున్నారు. వీటితో పాటు గ్లాస్‌పెయింటింగ్స్, పిల్లర్ బోర్డులు, స్టిక్కర్లు, జెండాలపై ప్రచారాలు చేసినా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నియాన్ / గ్లోసైన్ బోర్డులకు కూడా దిగువ పేర్కొన్న విధంగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
⇒ బెలూన్లు, అంబ్రెల్లాలకు ఒక్కోదానికి ఎస్ కేటగిరీలో రూ. 5 వేలు, ఎ కేటగిరీలో రూ. 4 వేలు, బి కేటగిరీలో రూ. 3 వేలు, సి కేటగిరీలో రూ. 2లు వంతున చెల్లించాల్సి ఉంటుంది.
⇒ సినిమాహాళ్లలో ప్రదర్శించే సై ్లడ్స్‌కు ఒక్కో స్లైలడ్‌కు నెలకు దాదాపు రూ. 150 నుంచి రూ. 250 వసూలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
⇒ ఇంకా సీసీ టీవీల ద్వారా ప్రదర్శనలు, సినిమా హాళ్లలో ప్రైవేట్ షార్ట్‌ఫిల్మ్‌లు తదితరమైన వాటిపై సైతం నెలప్రాతిపదికన ఫీజులు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
⇒ దేశంలోని వివిధ నగరాల్లో వసూలు చేస్తున్న ప్రకటనల పన్నును పరిగణనలోకి తీసుకొని జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.
స్పెషల్ కేటగిరీగా మెట్రోమార్గం
పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్‌ఆర్, మెట్రోరైలు కారిడార్లలో ప్రకటనల ఏర్పాటుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంచనా వేసి ఆయా మార్గాలను ప్రకటనల పన్ను వసూళ్లకు ‘స్పెషల్’(ఎస్) కేటగిరీ మార్గాలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని డిమాండ్‌ను బట్టి మిగతా గ్రేడ్ల ప్రాంతాలను గుర్తించనున్నారు.