చితికిన చిన్న రైతు
♦ వరుస కరువులతో కుదేలు
♦ పంట నష్టపోయిన వారిలో 95 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే
♦ కరువు మండలాల్లో మొత్తం 33.81 లక్షల ఎకరాల్లో పంటనష్టం
♦ అందులో 29.64 లక్షల ఎకరాలు చిన్న రైతులవే
సాక్షి, హైదరాబాద్: వరుస కరువులతో పంటలన్నీ ఎండిపోవడంతో రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులు కుదేలయ్యారు. కేవలం కరువు మండలాల్లోనే 20.52 లక్షల మంది చిన్న రైతుల పెట్టుబడులు మట్టిపాలయిన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. రాజస్తాన్, కర్ణాటక తర్వాత దేశంలోనే మూడో అత్యంత కరువు దుర్భిక్ష ప్రాంతం తెలంగాణ. గడిచిన 18 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏకంగా 15 సంవత్సరాలు కరువు వెంటాడటంతోపాటు.. గడిచిన రెండేళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు శరాఘాతంలా మారింది. గత ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావంతో ఏడు జిల్లాల్లోని 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇటీవల ఆయా ప్రాంతాల్లో వాస్తవ నష్టాన్ని లెక్కగట్టింది. మొత్తంగా 21.77 లక్షల మంది రైతుల పంటలు నష్టపోయినట్లుగా గుర్తించింది. నష్టపోయిన రైతుల్లో 20.52 లక్షల మం ది (94.23శాతం) సన్న, చిన్నకారు రైతులే ఉండటం గమనార్హం.
పెట్టుబడులు మట్టిపాలు: కనీసం 33 శాతానికి మించి దెబ్బతిన్న పంటలను మాత్రమే పంట నష్టం సర్వేకు పరిగణనలోకి తీసుకున్నారు. కానీ చిన్న రైతులు తమ చిన్న కమతాల్లో పెట్టిన పెట్టుబడులన్నీ మట్టిపాలయ్యాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం 33.81 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లితే.. అందులో 29.64 లక్షల ఎకరాలు చిన్న రైతులకు సంబంధించినవే! ఖరీఫ్‌లో మొత్తం పంట ఉత్పత్తుల నష్టం రూ.1,790.79 కోట్లుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్క తేల్చింది. అందులో రూ.1,600 కోట్లకు పైగా చిన్న రైతులు నష్టపోయినట్లు ఇటీవలి సర్వేతో స్పష్టమైంది.
అప్పుల ఊబిలోకి రైతన్న: రాష్ట్రంలో ఇప్పటికే 74 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణలో ఒక్కో రైతుపై సగటున రూ.84,423 అప్పు ఉంది. వీటికితోడు వరుసగా రెండేళ్లుగా పంట నష్టంతో ఈ అప్పుల కుప్ప మరింత పెరిగిపోయినట్లయింది. 2013 తర్వాత తెలంగాణలో వరుసగా రెండు సంవత్సరాలు కరువు నెలకొంది. దీంతో సగటు రైతు అప్పు కాస్తా లక్ష రూపాయలు దాటిపోయిందనే అంచనాలున్నాయి.
మరోవైపు చిన్న రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాధారణంగా కరువు మండలాలుగా గుర్తించిన ప్రాంతాల్లోని రైతులు తమ రుణాలను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ప్రభుత్వం రైతుల పంట రుణాలు మాఫీ చేయడంతో ఈ సదుపాయం అందకుండా పోయింది. కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించేందుకు కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కరువు మండలాల్లో నష్టపోయిన రైతుల సంఖ్యే 20 లక్షలపైన ఉంది. కరువు ప్రకటించని మండలాలనూ పరిగణననలోకి తీసుకుంటే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనా.