సొసైటీలో ‘సోషల్‌’ క్రేజ్‌ | Social media craze in the society | Sakshi
Sakshi News home page

సొసైటీలో ‘సోషల్‌’ క్రేజ్‌

Published Thu, Jan 11 2018 1:57 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Social media craze in the society - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రచారానికైనా.. నిరసనకైనా.. పొగడ్తలకైనా.. తెగడ్తలకైనా ఇప్పుడంతా సోషల్‌ మీడియానే. కయ్యానికి కాలుదువ్వాలన్నా, దూసిన కయ్యానికి పదును పెరగాలన్నా.. నిర్ణయాలు తీసుకోవాలన్నా, తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించాలన్నా.. వ్యాపార ప్రకటనలకైనా, కీర్తిప్రతిష్టలకైనా ఆయుధం, అస్త్రం సామాజిక మాధ్యమమే. మనోభావాలను పంచుకోవడం, సమకాలీన పరిస్థితులపై గళం విప్పడం, నవీన ఆవిష్కరణలకు నాంది పలకడం, సామాజిక సేవకు సంసిద్ధులవడం.. అన్నింటికీ సోషల్‌ మీడియా వేదికవుతోంది. కీలక నిర్ణయాలు, ఘాటైన వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు హల్‌చల్‌ చేస్తున్నారు.  

ట్రంప్, కిమ్‌ ట్వీట్‌ వార్‌ 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఇటు పాకిస్తాన్, అటు ఉత్తర కొరియాపై కొన్ని నెలలుగా తన నిర్ణయాలను ట్వీటర్‌లో వెలువరిస్తున్నారు. పాక్‌కు భద్రత సహాయం వెనక్కి తీసుకోవడం నుంచి ఆర్థిక సహాయం వరకూ ట్వీటర్‌లోనే తెలిపారు.   ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ నిర్ణయాలను వ్యతిరేకించ డంతో పాటు అణుయుద్ధానికి ఢీ అంటే ఢీ రీతిలో స్పందించి ప్రపంచమంతా తన నిర్ణయాలపై చర్చించుకునేలా చేశారు.
 
ప్రతి రోజూ టాప్‌ ట్రెండింగ్‌ 
దేశంలో ఎక్కువగా ఏ విషయానికి ట్వీటర్‌ను వాడారో ప్రతిక్షణం అందులో ట్రెండ్‌ అవుతుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌రోషన్‌ పుట్టినరోజు సందర్భంగా కోట్ల మంది శుభాకాంక్షలు తెలిపారు. 100 శాతం ఎఫ్‌డీఐలపైనా ట్వీటర్‌లో భారీ చర్చే జరిగింది. మొబైల్‌ ఫోన్‌ ఆఫర్లపై ట్వీట్లకూ భారీ డిమాండ్‌ కనిపించింది.   

పొలిటికల్‌ ట్వీట్‌ వార్‌ 
రాష్ట్రంలో రాజకీయపరంగా ట్వీటర్‌ ఖాతా వినియోగంలో మంత్రి కేటీఆర్‌ అందరికన్నా ముందున్నారు. తన నిర్ణయాలు, అభిప్రాయాలను మంత్రి ట్వీటర్‌లో వెల్లడిస్తున్నారు. తమ సమస్యలనూ ప్రజలు ట్వీటర్‌లోనే తెలపడం, నిర్ణయాన్నీ అక్కడే వెలువరించడం జరుగుతోంది. తెలంగాణలో సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసుపై ట్వీటర్‌లో దుమారం రేగింది. డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చినపుడు మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ చేసిన ట్వీట్‌ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.  

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మధ్య రగులుతున్న హిందూ రగడ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలు కంగనా రనౌత్, హీరో హృతిక్‌ రోషన్‌ మధ్య వేధింపుల వ్యవహారమూ ట్వీటర్‌ వేదికగా బాలీవుడ్‌ ఇండ స్ట్రీలో వేడి రగిల్చింది. తాజాగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై టాలీవుడ్‌ సినీ విమర్షకుడు కత్తి మహేశ్‌ ట్వీట్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే వ్యవహారంలో హీరోయిన్‌ పూనమ్‌కౌర్‌ ట్వీట్లూ వేడి రగిల్చాయి. అలాగే అమాయక యువతను తెలంగాణ పోలీస్‌ ఉగ్రవాదం పేరుమోపి వేధిస్తోందని డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలను ట్వీటర్‌లోనే పోలీస్‌ శాఖ తిప్పికొట్టింది.  

కంపెనీలు సైతం.. 
ట్వీటర్‌లో పలు కంపెనీలకు మంచి క్రేజ్‌ ఉంది. బ్యాంకుల్లో ఎస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, ఆర్‌ఐడీఎల్‌ఆర్‌తో పాటు మొబైల్‌ కంపెనీల్లో రియలన్స్, ఎయిర్‌టెల్, ఫ్లిప్‌కార్ట్, బీఎండబ్ల్యూ, సామ్‌సంగ్, కేరళ టూరిజం, ఎఫ్‌1 రేస్, జాతీయ మీడియా చానళ్లు, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్, మ్యూజిక్‌ చానళ్లున్నాయి.  

నో మాస్, నో క్లాస్‌.. 
భారత్‌ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ట్వీటర్‌ హవా అంతా ఇంతా కాదు. అమెరికా అధినేత ట్రంప్‌ నుంచి సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ వరకు ట్వీటర్‌ వేదికగా చెలరేగుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి ట్వీట్‌ చేసినా క్షణాల్లో స్పందించడం, ప్రతి ట్వీట్‌ చేయడం జరుగుతోంది. మరోవైపు ట్వీటర్‌కు ఏమాత్రం తగ్గకుండా ఫేస్‌బుక్‌ కూడా సామాజిక పోస్టింగ్‌ వార్‌లో తనదైన ముద్ర వేస్తోంది. మాస్, క్లాస్‌ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఖాతా తెరుస్తు న్నారు. అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సోషల్‌ మీ డియా వార్‌లో ట్వీటర్, ఫేస్‌బుక్‌ ప్రధాన ఆయు ధాలుగా నిలుస్తున్నాయని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

కోట్లలో ఫాలోవర్స్‌ 
ప్రధాని నరేంద్రమోదీ తన అధికార నిర్ణయాలు, అభిప్రాయాలు అధికారిక ట్వీటర్‌ ఖాతాæ ద్వారా పంచుకుంటున్నారు. ఆయనకు దాదాపు 3.9 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. రాహుల్‌గాంధీ ట్వీట్లకూ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రస్తుతం రాహుల్‌కు 55 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌ కురువృద్ధుడు దిగ్విజయ్‌సింగ్‌ చేసే ట్వీట్లు హాట్‌ టాపిగ్గా మారుతుంటాయి. ప్రధానిపై వాడివేడిగా ట్వీట్లు చేస్తుంటారు.

కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్న సెలబ్రిటీల్లో అమితాబ్‌బచ్చన్, షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, రజనీకాంత్, దీపికా పదుకోన్, హృతిక్‌రోషన్, ప్రియాంకాచోప్రా, అక్షయ్‌కుమార్, ఏఆర్‌ రెహమాన్, సచిన్‌ టెండూల్కర్, విరాట్‌ కోహ్లీ, కరణ్‌ జోహార్, అభిషేక్‌బచ్చన్, సోనమ్‌కపూర్, షాహిద్‌కపూర్, ఆలియాభట్, అనుష్కశర్మ ఉన్నారు. రాజకీయరంగానికొస్తే ప్రధాని మోదీతోపాటు అరవింద్‌ కేజ్రీవాల్, శశి థరూర్, సుష్మాస్వరాజ్, ఒమర్‌ అబ్దుల్లా, ఎస్‌ఎం కృష్ణ, దిరిక్‌ ఓబ్రియాన్, సల్మాన్‌ అనీజ్, కేడీ సింగ్, రాజీవ్‌ చంద్రశేఖర్, ప్రియాదత్, సంజయ్‌ నిరుపమ్, స్మృతీ ఇరానీ, అఖిలేశ్‌యాదవ్, అరుణ్‌జైట్లీ, నితిన్‌ గడ్కరీ తదితరులున్నారు. టాలీవుడ్‌లో నాగార్జున, పవన్‌కళ్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్,  రానా, నితిన్, అఖిల్, సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్, తదితరులున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement