ఈ పువ్వుకు వెలుగులు పూస్తాయి!
సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవాలని ఉన్నా.. వాటిని బిగించుకోవడం, సామర్థ్యానికి తగినంత విద్యుత్ ఉత్పత్తి చేసేలా నిర్వహించడం పెద్ద తలనొప్పి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగే సూర్యుడికి అనుగుణంగా సోలార్ ప్యానెల్స్‌ను తిప్పకపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తీ తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ ‘స్మార్ట్’గా చెక్ పెట్టారు ఆస్ట్రియాకు చెందిన ‘స్మార్ట్‌ఫ్లవర్’ కంపెనీ శాస్త్రవేత్తలు. పొద్దుతిరుగుడు పువ్వు మాదిరిగా రోజంతా సూర్యుడిని వెంటాడుతూ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను అభివృద్ధి చేశారు.
మరెన్నో సూపర్ ఫీచర్లు
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలను ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచడం వల్ల ఇది నింగిలోకి సూరీడు తొంగిచూడగానే అదే విచ్చుకుని విద్యుదుత్పత్తి ప్రారంభిస్తుంది. చీకటి పడిన వెంటనే ముడుచుకుపోతుంది. విద్యుత్‌ను నిల్వ చేసుకునేందుకు దీంట్లోనే ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇల్లు మారితే కేవలం గంటలోనే దీన్ని ఎంచక్కా మడిచి వెంట తీసుకెళ్లవచ్చు. ప్యానళ్లు బాగా వేడెక్కితే విద్యుదుత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి.. ఈ ప్లాంట్‌లోని సోలార్ ప్యానెళ్ల వెనుక చిన్న రంధ్రాలు ఏర్పాటు చేశారు.
ఇక దుమ్మూ ధూళి పేరుకుపోకుండా ప్యానెళ్లపై ప్రత్యేకమైన పూత రక్షిస్తుంది. అంతేకాదు చీకటి పడగానే ముడుచుకుపోతుంది కాబట్టి దుమ్మూధూళి ప్యానెళ్లపై నుంచి కిందకు జారిపోతుంది. ఇళ్లపైకప్పులపై దాదాపు 270 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోగలిగిన ఈ సోలార్ ప్లాంట్‌లో భద్రతకు సంబంధించి మరో కీలకమైన సౌకర్యం కూడా ఉంది. దీనిలో ఏర్పాటు చేసిన సెన్సర్లు రోజంతా గాలి వేగాన్ని పరిశీలిస్తుంటాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే ప్యానెల్స్ ముడుచుకుపోతాయి. వేగం ఇంకా ఎక్కువైతే కిందకు దిగిపోతాయి.
విద్యుత్ అమ్ముకోవచ్చు కూడా..
దాదాపు 18 చదరపు మీటర్ల వైశాల్యమున్న స్మార్ట్‌ఫ్లవర్ సోలార్ ప్యానెళ్ల ద్వారా ప్రాంతాన్ని బట్టి సంవత్సరానికి 3,400 నుంచి 6,200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతో ఒక ఇంటి అవసరాలు తీరడమే కాదు.. మిగతా విద్యుత్‌ను అమ్ముకోవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. యూరోపియన్ దేశాల్లో మధ్యతరగతి కుటుంబాల వార్షిక విద్యుత్ వినియోగం 3,500 యూనిట్ల వరకు ఉంటుంది. అదే మన దేశంలో ఇది సగటున కేవలం 900 యూనిట్లే. అంటే ఇంకా చాలా విద్యుత్ అమ్ముకోవచ్చు. ప్రస్తుతం దీని ధర కాస్త ఎక్కువే. విసృ్తతంగా వినియోగంలోకి వస్తే ధర తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.