( ఫైల్ ఫోటో )
నెల్లూరు సిటీ: ప్రకృతి సహజ సిద్ధంగా లభిస్తున్న సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తిపై జిల్లా ప్రజలు దృష్టి సారించారు. ప్రభుత్వ సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు, గృహ వినియోగంలో సోలార్ గ్రిడ్ సిస్టమ్‌పై ఆసక్తి పెరిగింది. భవిష్యత్‌లో తమ అవసరాలకు పోను మిగులు విద్యుత్‌ను విద్యుత్‌శాఖకు విక్రయించే అవకాశం ఉండడంతో దీనిపై దృష్టి సారిస్తున్నారు. ఇటు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు రాబడిని పెంచుకునేందుకు ఇదొక మార్గంగా ఉండడంతో రోజు రోజుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్స్ ఏర్పాటుకు ఆదరణ పెరుగుతోంది. గ్రిడ్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌కు విద్యుత్ శాఖ సంపూర్తిగా సహకరిస్తోంది. సోలార్‌ను వినియోగించడం ద్వారా బొగ్గు వినియోగం, కాలుష్య సమస్యలు తగ్గుతాయి.
ప్రభుత్వ కార్యాలయాల్లో..
నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో 60 కేడబ్ల్యూపీ గ్రిడ్ కనెక్ట్‌డ్ రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. దాదాపు రూ.32.50 లక్షలు ఖర్చు చేశారు. ప్రతి రోజూ 240 కేడబ్ల్యూహెచ్ విద్యుత్ వినియోగం ఖర్చు అవుతోంది. నెలకు 7,200 కేడబ్ల్యూహెచ్ ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన ప్రతి నెలా రూ.55,080 ప్రకారం ఏడాదికి రూ.6,60,960 ఖర్చు అవుతుంది. నెల్లూరులోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ ప్యానల్స్ వినియోగిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నూనతంగా కార్పొరేషన్‌లో ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ విద్యాసంస్థలు గీతాంజలి, నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వ్యవసాయదారులు, విద్యాసంస్థలు, వ్యాపారస్తులు, ఇళ్లకు కలిపి దాదాపు 500 సోలార్ కనెక్షన్లు ఉన్నాయి.
సోలార్‌లో రెండు రకాలు
సోలార్‌లో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ రెండు రకాలు ఉన్నాయి. వినియోగదారుడు తనకు రెండింట్లో ఏది అవసరమో దానిని వినియోగించుంటారు. రెండింటి ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకునేందుకు, పూర్తిగా రాకుండా ఉండేందుకు ఉపయోగ పడుతుంది. వినియోగదారుడు తన ఇంటికి ఎంత అవసరమో ఆ విధంగా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంది. సోలార్ గ్రిడ్‌లు ఒక కిలోవాట్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఒక కిలో వాట్‌కు రోజుకు 4 యూనిట్లు విద్యుత్ తయారు అవుతుంది.
ß ఆన్‌గ్రిడ్ సిస్టమ్: ఆన్‌గ్రిడ్ సోలార్ ప్యానల్స్ ఏర్పా టు చేసుకోవడం ద్వారా సూర్యరస్మి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు కనెక్ట్ చేసుకోవాలి. తయారైన విద్యుత్‌ను గ్రిడ్ నుంచి ఉపయోగించుకోవచ్చు. కరెంట్ మీటర్‌కు కనెక్ట్ చేయడం ద్వారా ఎంత వరకు విద్యుత్‌ను వినియోగిస్తామో, అంత వరకు గ్రిడ్ ద్వారా తీసుకుని, మిగిలినది విద్యుత్ శాఖకు విక్రయించవచ్చు.
ఆఫ్ గ్రిడ్ సిస్టమ్: ఇది బ్యాటరీని రీచార్జ్ చేసుకున్న తర్వాత ఇంట్లో విద్యుత్ వినియోగ వస్తువులకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఇన్వర్ట్‌లా పని చేస్తుంది.
మూడేళ్ల నుంచి వినియోగిస్తున్నాను..
ప్రతి నెలా నాకు రూ.1500 నుంచి రూ.2000 విద్యుత్ బిల్లు వచ్చేది. మూడు కిలో వాట్‌ల సోలార్ ప్యానెల్‌ను పెట్టుకున్నాను. ప్రతి రోజూ 12 యూనిట్లు కరెంట్ తయారవుతుంది. నెలకు 250 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నాను. మిగిలిని విద్యుత్‌ను విద్యుత్‌శాఖకు విక్రయిస్తున్నాను. మూడేళ్ల నుంచి సోలార్‌ను వినియోగిస్తున్నాను.
– వీ సుధాకరన్, ఉస్మాన్‌సాహెబ్‌పేట
రూ.6 వేల విద్యుత్ బిల్లు ఆదా
నాకు దుస్తుల దుకాణం ఉంది. నేను ఇటీవల సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాను. నా దుకాణానికి ప్రతి నెలా రూ.6 వేల విద్యుత్ బిల్లు వచ్చేది. వ్యాపారస్తులు సోలార్‌ను వినియోగించడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది.
– రాజీవ్, వస్త్ర వ్యాపారి, కావలి
50 కిలో వాట్స్ ఇన్‌స్టాలేషన్ చేశాను
నేను రెండేళ్లుగా సోలార్ ఇన్‌స్టాలేటర్‌గా ఉన్నాను. ఇప్పటి వరకు 50 కిలో వాట్స్ సోలార్ ప్యానల్స్ ఇన్‌స్టాల్ చేశాను. ప్రజలు కూడా అవగాహన పెంచుకుని సోలార్‌ను వినియోగించాలి. భవిష్యత్‌లో విద్యుత్ ధరలను తగ్గించుకునేందుకు సోలార్ సిస్టం ఉపయోగపడుతోంది.
– పీ శ్రావణ్, సోలార్ ఇన్‌స్టాలర్
ఐదు రకాలు
1. సోలార్ వాటర్ హీటర్
2. సోలార్ అగ్రికల్చర్‡ మోటార్స్
3. సోలార్ ఫెన్సింగ్ ఫర్ అగ్రికల్చర్
4. సోలార్ స్ట్రీట్ లైట్
5. సోలార్ గ్రిడ్ సిస్టమ్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ
సోలార్ వాటర్ హీటర్: చల్లటి నీటిని వేడినీళ్లుగా మార్చే సాధనాలు మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. 100 లీటర్ల సోలార్ వాటర్ హీటర్ నుంచి 10 వేల లీటర్లకు పైగా వేడి చేసేందుకు వీలు ఉంటుంది.
సోలార్ అగ్రికల్చర్ మోటర్: విద్యుత్ శాఖ రాత్రి సమయాల్లోనే వ్యవసాయానికి విద్యుత్‌ను అందజేస్తున్నారు. పగలు సమయంలో ఫ్యాక్టరీలు, ఇతర సంస్థలు అధికంగా విద్యుత్‌ను వాడడం ద్వారా కరెంట్ సమస్య ఉంది. అయితే విద్యుత్ సమస్యను అధిగమించేందుకు తక్కువ ఖర్చుతో సోలార్ అగ్రికల్చర్‡ మోటార్స్‌తో పగటి పూట మోటార్స్‌ను వినియోగించవచ్చు.
సోలార్ ఫెన్సింగ్: రైతులకు తమ పొలాల్లో ఇతర జంతువులు దాడి నుంచి తప్పించుకునేందుకు, అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లకు రక్షణగా సోలార్ ఫెన్సింగ్‌ను వినియోగిస్తుంటారు. రైతులు పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్న సమయంలో కరెంట్ లేని సమయాల్లో పొలంలోకి ఇతర జంతువులు దాడి చేసే అవకాశం ఉంది. సోలార్‌ను వినియోగించడం ద్వారా 24 గంటలు రక్షణ కవచంగా మారుతుంది.
సోలార్ స్ట్రీట్ లైట్: ప్రభుత్వాలు ఇప్పటికే రోడ్లు డివైడర్లకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు కొన్ని ప్రధాన రోడ్లలో సోలార్ స్ట్రీట్ లైట్స్‌ను వినియోగిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి సోలార్ స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం సమయాల్లో విద్యుత్‌ను స్టోరేజ్ చేసుకుని రాత్రి సమయాల్లో వినియోగించుకుంటుంది.
సోలార్ గ్రిడ్ సిస్టమ్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ: సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ద్వారా విద్యుత్ బిల్లును చాలా వరకు తగ్గించుకోవ చ్చు. ఒక్కసారి పెట్టుబడి పెడితే 25 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, విద్యుత్ బిల్లులు కట్టాలనే సమస్య లేకుండా ఉండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment