టమోటా నుంచి సోలార్ పవర్
న్యూఢిల్లీ: వంటకాల్లో విరివిగా ఉపయోగించే టమోటాలతో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు సోలార్ సెల్‌ను తయారు చేశారు. ప్రస్తుతం సోలార్ ప్యానెల్స్‌లో ఉపయోగిస్తున్న సిలికాన్ సెల్స్ కన్నా ఇది ఎంతో చవకైనదని వారు తెలియజేశారు. టమోటా నుంచి తీసిన రసాయనాలకు కార్బన్, టైటానియం డైఆక్సైడ్ మిశ్రమాన్ని కలిపి ఓ పల్చటి ఫిల్మ్‌ను తయారు చేశామని, ఆ ఫిల్మ్ ఎండపడే విండో కిటీకీ అద్దానికి అతికించామని, ఆ ఫిల్మ్ నుంచి ఓ వైరును లాగి దాన్ని విద్యుత్ బల్బ్‌కు అమర్చగా ఆ బల్బ్ దేదీప్యమానంగా వెలిగిందని ఈ పరిశోధనల్లో పొల్గొన్న ప్రొఫెసర్ నికేశ్ షా వివరించారు. ఈ టమోటా సోలార్ సెల్‌కు తాము భారత ప్రభుత్వం ‘కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్’ నుంచి పేటెంట్ కూడా పొందామని చెప్పారు.
ప్రస్తుతం సోలార్ ప్యానెల్స్‌లో సిలికాన్ సెల్స్‌ను ఉపయోగిస్తున్నారని, సిలికాన్ ధర ఎక్కువవడమేకాకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, అదే టమోటా అయితే మన వద్దనే విరివిగా దొరుకుతుందని నికేశ్ తెలిపారు. వాణిజ్యపరంగా టమోటా సెల్స్‌ను ఉత్పత్తి చేసినట్టయితే దాదాపు సిలికాన్ సెల్స్‌కన్నా దాదాపు 75 శాతం ఖర్చు తక్కువవుతుందని ఆయన చెప్పారు. తాము కనిపెట్టిన ఈ కొత్త విధానం ద్వారా పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు తదుపరి చర్యలు తీసుకుంటున్నామని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం, వీవీ ఇంజనీరింగ్ కాలేజ్‌కి చెందిన నానో టెక్నాలజీ విభాగం అధిపతి జయసుఖ్ మార్కానా తెలిపారు.