విజృంభించిన ఉనద్కత్.. ఫైనల్లో సౌరాష్ట్ర, మహారాష్ట్ర
Vijay Hazare Trophy 2022 Saurashtra VS Karnataka: విజయ్ హజారే ట్రోఫీ 2022లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో కర్ణాటకపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా టోర్నీ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సౌరాష్ట్ర.. జయదేవ్ ఉనద్కత్ (4/26), ప్రేరక్ మన్కడ్ (2/34) విజృంభించడంతో కర్ణాటకను 171 పరుగులకే (49.1 ఓవర్లు) కుప్పకూల్చింది. కర్ణాటక ఇన్నింగ్స్లో సమర్థ్ (88) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
అనంతరం 172 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. పరుగులేమీ చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత కోలుకుని 36.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జే గోహిల్ (61) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (33), ప్రేరక్ మన్కడ్ (35), అర్పిత్ వసవద (25 నాటౌట్), చిరాగ్ జానీ (13 నాటౌట్) తలో చేయి వేసి జట్టును గెలిపించారు.
ఇదే రోజు జరిగిన రెండో సెమీఫైనల్లో రుతురాజ్ గైక్వాడ్ (126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు), అంకిత్ బావ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో మహారాష్ట్ర జట్టు 12 పరుగుల తేడాతో అస్సాంపై విజయం సాధించి, ఫైనల్కు చేరింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన అస్సాం లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రిషవ్ దాస్ (53), శివ్శంకర్ రాయ్ (78), స్వరూపం పుర్కాయస్తా (95) అర్ధశతకాలతో రాణించి, జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్లో గెలిచిన మహారాష్ట్ర రేపు (డిసెంబర్ 2) జరుగబోయే ఫైనల్లో తొలి సెమీస్ విన్నర్ సౌరాష్ట్రతో తలపడనుంది.