'త్వరలోనే తెలంగాణలో రాజకీయ శూన్యత' | soon Telangana will run into political vacuum, PA Sangma says | Sakshi
Sakshi News home page

'త్వరలోనే తెలంగాణలో రాజకీయ శూన్యత'

Published Sat, Jan 30 2016 6:45 PM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM

'త్వరలోనే తెలంగాణలో రాజకీయ శూన్యత' - Sakshi

'త్వరలోనే తెలంగాణలో రాజకీయ శూన్యత'

హైదరాబాద్: 'నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కోల్పోతున్నది. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైపోయింది. బలపడే అవకాశాలున్నా బీజేపీ వేళ్లూనుకోలేకపోతున్నది. ఇక అధికార టీఆర్ఎస్ తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయపార్టీలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి.. త్వరలోనే రాజకీయ శూన్యతకు దారితీస్తుంది'  అని లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సగ్మా జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన పేర్కొన్నారు.

శనివారం హైదరాబాద్ వచ్చిన పీఏ సంగ్మా.. హెచ్ సీయూలో విద్యార్థి వేముల రోహిత్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. శరద్ పవార్(ఎన్సీపీ) నుంచి విడిపోయిన తర్వాత తాను స్థాపించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్ పీపీ) ఇంకా గుర్తింపు పొందనప్పటికీ జాతీయ పార్టీగా ఎదుగిందన్న సగ్మా.. తెలంగాణకు చెందిన పలువురు నేతలు తనతో టచ్ లో ఉన్నారని, ఇక్కడి రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తునే ఉన్నానని చెప్పారు.

విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి మౌళిక అంశాలపై టీఆర్ఎస్ దృష్టి పెట్టడంలేదని, ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణలో 1500 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని సగ్మా అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుకాబోయే నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక.. అట్టడుగు వర్గాలకు మేలు చేసేలా, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని సంగ్మా భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్, గాదె ఇన్నయ్య, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement