హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఇవాళ నగరానికి విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రథమ పౌరుడికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ పాదాభివందనం చేశారు.
రాష్ట్రపతి నేటి నుంచి ఈ నెల 31 వరకు బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ సమయంలో రాష్ట్రపతి ఇక్కణ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. 23న ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్స్ స్నాత కోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం హెచ్‌ఐసీసీలో ఫ్యాఫ్సీ అధ్యర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. 24న మహిళా దక్షత సమితి కార్యక్రమంలో పాల్గొంటారు.
25న బెంగళూరులో జరిగే 89వ భారత్ బంగా సాహిత్య సమ్మేళనం కార్యక్రమానికి హాజరవుతారు. 26న మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 27న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు. 29న ఉదయం తిరువనంతపురంలో జరిగే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతారు.
అదే రోజున మైసూరులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 30న రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు విందు ఏర్పాటు చేస్తారు. 31వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.