లామకాన్ బచ్‌గయా.. | special story on hyderabad Lamakaan cultural space | Sakshi
Sakshi News home page

లామకాన్ బచ్‌గయా..

Published Sun, Jan 3 2016 5:19 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

లామకాన్ బచ్‌గయా.. - Sakshi

లామకాన్ బచ్‌గయా..

హైదరాబాద్: రోడ్డెక్కి ప్రదర్శనల్లేవు. హోరెత్తిన ధర్నాలూ నిరసనలూ లేవు. వేడుకోల్లేవు. వినతి పత్రాల్లేవు. దిక్కులు పిక్కటిల్లే నినాదాల్లేవు. దిష్టిబొమ్మల దహనాల్లేవు. అయినా నగర మునిసిపల్ అధికారులు తాము తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఇచ్చిన నోటీసులను చాపచుట్టారు. ఇదెలా సాధ్యమైంది? లామకాన్ ఎలా ‘సేవ్’ అయింది? సోషల్ మీడియా కారణంగా నగరంలో అధికారులు వెనుకడుగు వేసిన తొలి ఉదంతంగా ఎలా నిలిచింది?

 
 ‘‘ఐదేళ్లుగా ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నాం. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు చవిచూశాం. అందులో ఇదొకటి’’అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు బంజారాహిల్స్‌లోని లామకాన్ నిర్వాహకులు. అయితే లామకాన్‌ను వేదికగా చేసుకుని ఎదిగిన ఎందరో కళాకారులు, మరెందరో సృజనశీలురు, అభిమానులు మాత్రం ఊరుకోలేదు. ఆన్‌లైన్ వేదికగా చేసుకుని ప్రచార శంఖం పూరించారు. సేవ్ క్రియేటివిటీ, సేవ్ లామకాన్ అంటూ కొన్ని రోజుల పాటు సాగిన ప్రచారానికి అనూహ్యమైన మద్దతు లభించింది. నేతలు, అధికారులను  కదలించింది. లామకాన్ మూసివేత నిర్ణయాన్ని అటకెక్కించింది.
 
వేదిక ఒకటే... వెలుగులెన్నో...
ఐదేళ్ల చిరు ప్రాయంలోనే... ఎందరో థియేటర్ ఆర్టిస్టులు, గాయకుల కళల సాకారానికి వేదికగా,  పుస్తకావిష్కరణలు, షార్ట్ ఫిలిం రూపకల్పనల వంటి ఎన్నో చక్కని కార్యక్రమాల నిలయంగా, చిరు వ్యాపారులు, హస్తకళాకారులకు ఊతంగా... ఎదిగింది బంజారాహిల్స్‌లోని లామకాన్. దీనిని సహేతుకమైన కారణం లేకుండా మూసివేయాలన్న నిర్ణయం ఎందరినో తీవ్రమైన ఆవేదనకు గురి చేసింది. దీంతో ఆన్‌లైన్ వేదికగా పోరు ప్రారంభమైంది. సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించారు.
 
కేవలం కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి మాత్రమే కాకుండా వారికి వందల సంఖ్యలో ఆడియన్స్‌ను కూడా అందిస్తోందని ఈ ప్రచారకర్తలు గుర్తు చేశారు. సూత్రధార, రంగధార, ఉడాన్, నిషుంబిత, డ్రమ్మనాన్ వంటి అనేక థియేటర్ సంస్థలు లామకాన్ నీడనే ఎదిగాయని ఉదహరించారు. ముంబయికి చబిల్‌దాస్ ఎలానో హైదరాబాద్‌కి లామకాన్ అలా రూపుదిద్దుకోనుందంటూ పేర్కొన్నారు. ఒక స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సృజనాత్మక వేదికను పార్కింగ్, స్మోకింగ్ వంటి చిన్న చిన్న కారణాలతో మూసివేయడం ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు.
 
అ‘సైన్డ్’ వార్...
ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక క్యాంపెయిన్ సక్సెస్ కావాలంటే కనీసం 500 సంతకాలు కావాలి. అప్పుడే దాన్ని సోషల్ మీడియా నుంచి ప్రభుత్వానికి చేరదగ్గదిగా పరిగణిస్తారు. లామకాన్ కోసం ఇలాంటి క్యాంపెయిన్‌లు రకరకాల రూపాల్లో నడిచాయి. దాదాపు 10వేల సంతకాలకు పైగా వీటికి మద్దతిచ్చాయి. ఈ ఆన్‌లైన్ ఉద్యమం మంత్రి కెటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వంటివారి చెవిన పడింది. ఫలితం... లామకాన్‌కు కొత్త ఊపిరొచ్చింది. అంటే మరెందరో ప్రతిభావంతులు ప్రకాశించే అవకాశం వచ్చింది.  
 
లామకాన్‌కు వచ్చే కొందరు అత్యుత్సాహవంతుల కారణంగా స్థానికులకు కలుగుతున్న అసౌకర్యాలకు నిర్వాహకులు తగిన పరిష్కారం చూపించాలని, లాంగ్ లివ్ లామకాన్ అంటున్న వేలాది ఆశీర్వచనాలే ఆసరాగా ఈ వేదిక నిరంతరం వర్ధిల్లి మరెందరో యువ ప్రతిభావంతుల వెలుగులకు దారి చూపాలని కళాభిమానుల ఆశ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement