lamakaan
-
పురస్కారాలతో ప్రోత్సాహం: వేణుగోపాల చారి
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఉన్న వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం మంచి విషయమని కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో జరిగిన మెగా రికార్డ్స్ ఇండిపెండెన్స్ డే అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాలు అందించడం ప్రోత్సహకరంగా ఉంటుందన్నారు. మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు పి. శ్రీనివాసరావును ఆయన అభినందించారు. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రేణుకా ప్రభాకర్ శిష్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యప్రదర్శన, చిన్నారి రిత్విక్ శ్రీ డాన్స్ అలరించాయి. బండి రాములు, రుక్మిణి మాతాజీ బృందం యోగానాలు ఔరా అనిపించాయి. 70 ఏళ్ల వయసులో బండి రాములు వేసిన యోగానాలు సభికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. 15 మందికి ఈ సందర్భంగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నాగసాయి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. చిల్లా రాజశేఖర్‌రెడ్డి, జీసీ రెడ్డి, సనాతన బాలరాజు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఏఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: డాక్టర్ లాస్యసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు) -
లామకాన్ బచ్‌గయా..
హైదరాబాద్: రోడ్డెక్కి ప్రదర్శనల్లేవు. హోరెత్తిన ధర్నాలూ నిరసనలూ లేవు. వేడుకోల్లేవు. వినతి పత్రాల్లేవు. దిక్కులు పిక్కటిల్లే నినాదాల్లేవు. దిష్టిబొమ్మల దహనాల్లేవు. అయినా నగర మునిసిపల్ అధికారులు తాము తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఇచ్చిన నోటీసులను చాపచుట్టారు. ఇదెలా సాధ్యమైంది? లామకాన్ ఎలా ‘సేవ్’ అయింది? సోషల్ మీడియా కారణంగా నగరంలో అధికారులు వెనుకడుగు వేసిన తొలి ఉదంతంగా ఎలా నిలిచింది? ‘‘ఐదేళ్లుగా ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నాం. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు చవిచూశాం. అందులో ఇదొకటి’’అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు బంజారాహిల్స్‌లోని లామకాన్ నిర్వాహకులు. అయితే లామకాన్‌ను వేదికగా చేసుకుని ఎదిగిన ఎందరో కళాకారులు, మరెందరో సృజనశీలురు, అభిమానులు మాత్రం ఊరుకోలేదు. ఆన్లైన్ వేదికగా చేసుకుని ప్రచార శంఖం పూరించారు. సేవ్ క్రియేటివిటీ, సేవ్ లామకాన్ అంటూ కొన్ని రోజుల పాటు సాగిన ప్రచారానికి అనూహ్యమైన మద్దతు లభించింది. నేతలు, అధికారులను కదలించింది. లామకాన్ మూసివేత నిర్ణయాన్ని అటకెక్కించింది. వేదిక ఒకటే... వెలుగులెన్నో... ఐదేళ్ల చిరు ప్రాయంలోనే... ఎందరో థియేటర్ ఆర్టిస్టులు, గాయకుల కళల సాకారానికి వేదికగా, పుస్తకావిష్కరణలు, షార్ట్ ఫిలిం రూపకల్పనల వంటి ఎన్నో చక్కని కార్యక్రమాల నిలయంగా, చిరు వ్యాపారులు, హస్తకళాకారులకు ఊతంగా... ఎదిగింది బంజారాహిల్స్‌లోని లామకాన్. దీనిని సహేతుకమైన కారణం లేకుండా మూసివేయాలన్న నిర్ణయం ఎందరినో తీవ్రమైన ఆవేదనకు గురి చేసింది. దీంతో ఆన్లైన్ వేదికగా పోరు ప్రారంభమైంది. సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించారు. కేవలం కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి మాత్రమే కాకుండా వారికి వందల సంఖ్యలో ఆడియన్స్‌ను కూడా అందిస్తోందని ఈ ప్రచారకర్తలు గుర్తు చేశారు. సూత్రధార, రంగధార, ఉడాన్, నిషుంబిత, డ్రమ్మనాన్ వంటి అనేక థియేటర్ సంస్థలు లామకాన్ నీడనే ఎదిగాయని ఉదహరించారు. ముంబయికి చబిల్దాస్ ఎలానో హైదరాబాద్‌కి లామకాన్ అలా రూపుదిద్దుకోనుందంటూ పేర్కొన్నారు. ఒక స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సృజనాత్మక వేదికను పార్కింగ్, స్మోకింగ్ వంటి చిన్న చిన్న కారణాలతో మూసివేయడం ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు. అ‘సైన్డ్’ వార్... ఆన్లైన్లో ఏదైనా ఒక క్యాంపెయిన్ సక్సెస్ కావాలంటే కనీసం 500 సంతకాలు కావాలి. అప్పుడే దాన్ని సోషల్ మీడియా నుంచి ప్రభుత్వానికి చేరదగ్గదిగా పరిగణిస్తారు. లామకాన్ కోసం ఇలాంటి క్యాంపెయిన్లు రకరకాల రూపాల్లో నడిచాయి. దాదాపు 10వేల సంతకాలకు పైగా వీటికి మద్దతిచ్చాయి. ఈ ఆన్లైన్ ఉద్యమం మంత్రి కెటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వంటివారి చెవిన పడింది. ఫలితం... లామకాన్‌కు కొత్త ఊపిరొచ్చింది. అంటే మరెందరో ప్రతిభావంతులు ప్రకాశించే అవకాశం వచ్చింది. లామకాన్‌కు వచ్చే కొందరు అత్యుత్సాహవంతుల కారణంగా స్థానికులకు కలుగుతున్న అసౌకర్యాలకు నిర్వాహకులు తగిన పరిష్కారం చూపించాలని, లాంగ్ లివ్ లామకాన్ అంటున్న వేలాది ఆశీర్వచనాలే ఆసరాగా ఈ వేదిక నిరంతరం వర్ధిల్లి మరెందరో యువ ప్రతిభావంతుల వెలుగులకు దారి చూపాలని కళాభిమానుల ఆశ. -
లామకాన్ మూసివేత నోటీసులు వెనక్కి
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌రోడ్ నెం.1లోని లామకాన్‌ను మూసివేయాలంటూ జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసులను అధికారులు వెనక్కి తీసుకున్నారు. లామకాన్‌ను మూసివేయాలంటూ జీహెచ్ఎంసీ సెంట్రల్ జోనల్‌కమిషనర్ వరుసగా మూడు నోటీసులు జారీ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్‌చేసి గడిచిన పది రోజుల నుంచి హాట్‌టాపిక్‌గా మారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంతో మంది ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్న ఈ కేంద్రాన్ని మూసివేయడం ఎంత వరకు సమంజసం అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. క్షణాల్లోనే అసద్ ట్వీట్‌ను చూసిన రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ వెంటనే ఈ నోటీసులను ఉప సంహరించుకునేలా జీహెచ్ఎంసీకి సూచిస్తామని పేర్కొన్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులను వెనక్కి తీసుకున్నారు. ప్రతిరోజూ వందలాది మంది యువతీ, యువకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు బృందాలుగా ఏర్పడి లామకాన్‌లో వివిధ అంశాలపై చర్చించుకుంటారు. ఇక్కడంతా ఉచిత సేవలు లభిస్తుంటాయి. అయితే లామకాన్ ముందు అక్రమపార్కింగ్లు, కొంత మంది బహిరంగ ధూమపానం చేయడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ రోడ్డులో నివసిస్తున్న ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతం నుంచి మహిళలు నడవలేని పరిస్థితులు ఉన్నాయని కూడా స్థానికులు ఆరోపించారు. తమ ఇళ్ల ముందు నో పార్కింగ్ బోర్డులను కూడా ఏర్పాటుచేసుకున్నా ఫలితం లేదని వారు వాపోయారు. అయితే జీహెచ్ఎంసీ నోటీసులకు లామకాన్ సమాధానం ఇస్తే పార్కింగ్ సమస్య తలెత్తకుండా చూస్తామని చెప్పారు. అయిదు మీటర్ల వరకు ధూమపానం నిషేధిస్తామని కూడా వెల్లడించారు. -
సమజ్దార్ లోగ్
‘చదివిస్తే ఉన్న మతి పోయిందట’... ఓ పాత సామెత. ప్రస్తుత పరిస్థితి కూడా అదే. ఉన్నతచదువులు చదువుకున్నా అందుకు తగిన ఉద్యోగం దొరకక మతులు పోగొట్టుకున్నవాళ్లు ఎంతోమంది. అలా మతి చలించని ఓ నిరుద్యోగి వ్యథే ఈ నాటకం కథ. ఇటీవల లామకాన్‌లో ప్రదర్శించిన ‘సమజ్దార్లోగ్’ నాటకం గురించి క్లుప్తంగా... - ఓ మధు త్రిబుల్ ఎంఏలు చేసినా ఉద్యోగం రాని ఓ యువకుడిది పూట గడవని స్థితి. అశాంతి, దుఖం వేధిస్తుంటే పిచ్చివాడిగా ఆసుపత్రిలో చేరి బతుకుతుంటాడు. అతనితో పాటు ఉండే మరో ముగ్గురు పిచ్చి వాళ్లతో కూడిన సంభాషణలే ఈ నాటకం. ఆ పిచ్చాసుపత్రి ఆవరణలో అనేక సమస్యలు. అయినా బయటి సమాజంలో ఉన్న ఇబ్బందులకంటే ఆస్పత్రిలోవి అసలు సమస్యలుగానే తోచవతనికి. బిడ్డను అమ్ముకునే తల్లి, మతం మాటున మానవత్వాన్ని తాకట్టు పెట్టే పెద్దమనుషులు, తరాలు మారిన తారతమ్యాలు తొలగని సమాజం.. రాచరికం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ వరకూ మోసపోతూనే ఉన్న ప్రజలు... ఎంతో గంభీరమైన ఈ విషయాలను చక్కటి చలోక్తులతో నొప్పించకుండా కళ్లకు కట్టారు ఈ నాటకం ద్వారా. రాచరిక వ్యవస్థలో కొనసాగిన అధికారదాహం, మూర్ఖపు నిర్ణయాలు, విలాసాల మాయలో రాజ్య కార్యకలాపాలను పక్కకు పెట్టిన తీరు, రాచరికం అంతరించి నుంచి ప్రజాస్వామ్యం రాజ్యమేలుతున్నా... ఆ ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్న కులం, మతం, అరాచక, అక్రమ వ్యవస్థలను మన కళ్లముందుంచారు ఆ నలుగురు. అధికారం కోసం ముగ్గురు పిచ్చివాళ్లు పడే తాపత్రయం.. అధికారంలోకి వచ్చిన అనంతరం వ్యవహరించే తీరు.. బాధ్యతారాహిత్యం, లంచగొండితనం... ఒకటేమిటి అనేక సమస్యలకు అద్దం పట్టారు. ఈ పరిస్థితులకు అందరూ బాధ్యులే అంటూ ముగుస్తుంది నాటకం. నాటకం ముగిసినా ఆ పాత్రలు చెప్పిన విషయాలు మనలను వెంటాడుతుంటాయి. అందరినీ ఆలోచనల్లో పడేస్తాయి. నాటకంలో పిచ్చి వాళ్లుగా మెప్పించారు రాహుల్ కమలేకర్, రాజేశ్ షోణ్గయ్, నిఖిలేష్. చదుపుకున్న పిచ్చివాడిగా నటించిన అలీ అహ్మద్ ఈ నాటకానికి దర్శకత్వం వహించారు. సురేందర్ శర్మ రాసిన ఈ నాటకాన్ని దర్పణ్ థియేటర్ గ్రూప్ ప్రదర్శించింది. -
నేడు హైదరాబాద్‌లో 'ఉషశ్రీ ఉభయకుశలోపరి'
బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 1లోని జీవీకే మాల్ ఎదురుగా ఉన్నసాంస్కృతిక వేదిక లామకాన్‌లో ఈ రోజు సాయంత్రం 5.00 'ఉషశ్రీ ఉభయకుశలోపరి' పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఫేస్‌బుక్‌లోని ఉషశ్రీ అభిమానుల వేదిక శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉషశ్రీ సన్నిహితులు,రచయిత శ్రీరమణ, విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి చెందిన ఏ.బి.ఆనంద్‌లు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఉషశ్రీ మిషన్ 8008551231ను సంప్రదించాలని పేర్కొంది. ఉషశ్రీ అభిమానులు, ఆలిండియా రేడియోలో ఆయన ప్రసంగాలు విన్నవారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చింది.